భారత్‌ కార్పొరేట్‌ అవుట్‌లుక్‌... పాజిటివ్‌ | Strong demand, rising vaccination rate drive positive outlook for Indian corporates | Sakshi
Sakshi News home page

భారత్‌ కార్పొరేట్‌ అవుట్‌లుక్‌... పాజిటివ్‌

Published Sat, Nov 27 2021 6:23 AM | Last Updated on Sat, Nov 27 2021 6:23 AM

Strong demand, rising vaccination rate drive positive outlook for Indian corporates - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ కంపెనీల అవుట్‌లుక్‌ పాజిటివ్‌గా ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ– మూడీస్‌ తాజా నివేదికలో పేర్కొంది. దేశంలో నెలకొన్న పటిష్ట డిమాండ్, విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్‌ ఇందుకు దోహదపడుతున్న అంశాలని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ వివరించింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ, అధిక ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు వినియోగం పెరుగుతుండడం కూడా కంపెనీల సానుకూల అవుట్‌లుక్‌కు కారణమని పేర్కొంది. ఈ మేరకు సంస్థ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను
పరిశీలిస్తే...

► మార్చి 2022తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9.3 శాతం ఉంటుందని అంచనా.  ఆ తర్వాత 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం.  
► స్థిరమైన ఆర్థిక పునరుద్ధరణకు వీలుగా భారత కంపెనీలకు క్రెడిట్‌ ఫండమెంటల్స్‌ సానుకూలంగా ఉన్నాయి. పటిష్ట వినియోగదారుల డిమాండ్,  అధిక కమోడిటీ ధరల కారణంగా రేటెడ్‌ కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి.
► వ్యాక్సినేషన్‌ విస్తృతి, స్థిరమైన వినియోగదారుల విశ్వాసం, తక్కువ వడ్డీ రేట్లు, అధిక ప్రభుత్వ వ్యయం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు సానుకూల క్రెడిట్‌ ఫండమెంటల్స్‌ బలాన్ని అందిస్తున్నాయి.  
► ఆయా అంశాలు భారతదేశ వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలలో స్థిరమైన పునరుద్ధరణకు దోహదపడుతున్నాయి. ఆంక్షల సడలింపు తర్వాత వినియోగదారుల డిమాండ్, వ్యయం, తయారీ కార్యకలాపాలు కోలుకుంటున్నాయి. అధిక కమోడిటీ ధరలతోసహా ఈ పోకడలు రాబోయే 12–18 నెలల్లో రేటెడ్‌ కంపెనీల స్థూల ఆదాయాల్లో గణనీయమైన వృద్ధిని పెంచుతాయి.  
► మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఉక్కు, సిమెంట్‌ డిమాండ్‌లను పెంచుతుంది. మరోవైపు పెరుగుతున్న వినియోగం, దేశీయ తయారీ పురోగతికి కేంద్రం తోడ్పాడు, నిధుల లభ్యత సజావుగా ఉండడానికి చర్యలు కొత్త పెట్టుబడులకు తగిన పరిస్థితులను సృష్టిస్తాయి.  


మూడవవేవ్‌ వస్తే మాత్రం కష్టమే...
ఎకానమీకి మూడవ వేవ్‌ సవాళ్లూ ఉన్నాయి. ఇదే జరిగితే తాజా లాక్‌డౌన్ల ప్రకటనలు జరుగుతాయి. ఇది వినియోగ సెంటిమెంట్‌ పతనానికి దారితీస్తుంది. ఇలాంటి వాతావరణం ఆర్థిక క్రియాశీలతను, వినియోగ డిమాండ్‌ను పడగొడుతుంది. కంపెనీల స్ళూల ఆదాయాలూ పడిపోతాయి. కరోనా మూడవ వేవ్‌ పరిస్థితుల్లో– స్థూల ఆదాయాలు వచ్చే 12 నుంచి 18 నెలల్లో 15 నుంచి 20 శాతం పతనం అయ్యే వీలుంది. దీనికితోడు ప్రభుత్వ వ్యయంలో జాప్యం, పారిశ్రామిక ఉత్పత్తిని తగ్గించే తరహాలో చోటుచేసుకునే ఇంధన కొరత, ధరా భారం, డిమాండ్‌ పెంపునకు వస్తువుల ధరలను తగ్గించడం వంటి అంశాలు కంపెనీల ఆదాయాలను తగ్గిస్తాయి.  

ద్రవ్యోల్బణం సవాళ్లు...
ప్రస్తుతం దేశ తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.  నిధుల సమీకరణ వ్యయాలను తగ్గిస్తున్నాయి. డిమాండ్‌ పెరిగేకొద్దీ కొత్త మూలధన పెట్టుబడికి మద్దతు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుదల వాతావరణం కనిపిస్తోంది. ఇది వడ్డీ రేటల్లో ఊహించిన దానికంటే వేగవంతమైన పెరుగుదలకు దారితీయవచ్చు.  ఇలాంటి ధోరణి వ్యాపార పెట్టుబడులపై అధిక భారాన్ని మోపుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement