నీరసించిన ‘సిప్‌’ పెట్టుబడులు

SIP collections drop to Rs 96,000 cr in FY21 - Sakshi

2020–21లో రూ.96,000 కోట్లే...

4 శాతం క్షీణత

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌/క్రమానుగత పెట్టుబడులు) రూపంలో వచ్చే పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలో (2020–21) 4% తగ్గి రూ.96,080 కోట్లుగా ఉన్నాయి. సగటున చూస్తే ప్రతీ నెలా రూ.8,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల ప్రభావం సిప్‌ పెట్టుబడులపై చూపించింది. 2019–20 సంవత్సరంలో ఇన్వెస్టర్లు సిప్‌ రూపంలో వివిధ పథకాల్లోకి రూ.1,00,084 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం గమనార్హం. సిప్‌తో పెట్టుబడులపై రిస్క్‌ తగ్గుతుంది. మార్కెట్లు గరిష్ట విలువల వద్ద, కనిష్ట విలువల వద్ద క్రమంగా పెట్టుబడులకు వీలు కల్పిస్తుంది. కనుక దీర్ఘకాలంలో రిస్క్‌ను అధిగమించి మెరుగైన రాబడులకు అందుకునే అవకాశం ఉంటుంది. గత కొన్నేళ్లలో సిప్‌ పెట్టుబడులను గమనించినట్టయితే.. 2016–17లో రూ.43,921 కోట్లు, 2017–18లో రూ.67,190 కోట్లు, 2018–19లో రూ.92,693 కోట్ల చొప్పున మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చాయి. ఏటా పురోగతి ఉన్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ప్రతికూల పరిస్థితుల ప్రభావం..: ‘‘టీకాలు ఇచ్చే కార్యక్రమం విజయవంతం కావడం, అంచనాలకు మించి ఆర్థిక పురోగతి, అధిక ఆదాయాలు సిప్‌ పెట్టుబడులపై రానున్న రోజుల్లో ప్రభావం చూపించే అంశాలు’’ అని ఫయర్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ గోపాల్‌ కావలిరెడ్డి తెలిపారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌లతో కొందరు ఇన్వెస్టర్లు సిప్‌లను నిలిపివేసినట్టు తెలుస్తోందని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో జిమ్మీ పటేల్‌ పేర్కొన్నారు. ‘‘సిప్‌ పెట్టుబడులు గత రెండు సంవత్సరాల్లో అధికంగానే ఉన్నాయి. మార్కెట్లలో అనిశ్చితులు పెరగడంతో ఇన్వెస్టర్లు సిప్‌ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని బ్రోకరేజీ సంస్థ షేర్‌ఖాన్‌ తెలిపింది..   

2020–21లో పబ్లిక్‌ ఇష్యూల సందడి
పబ్లిక్‌ ఇష్యూల రూపంలో నిధుల సమీకరణ గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2020–21) రెట్టింపు స్థాయిలో నమోదైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. రైట్స్‌ ఇష్యూ రూపంలో నిధుల సమీకరణ 15 శాతం పెరిగినట్టు తెలిపింది. కరోనా వైరస్‌ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిన సమయంలోనూ నిధుల సమీకరణ జోరుగా సాగినట్టు పేర్కొంది. 2020–21లో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (తొలి పబ్లిక్‌ ఆఫర్‌/ఐపీవో), ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో/లిస్టెడ్‌ సంస్థ తిరిగి పబ్లిక్‌ ఇష్యూ చేపట్టడం)కు 55 కంపెనీలు వచ్చాయి. అలాగే, 21 రైట్స్‌ ఇష్యూలు విజయవంతంగా పూర్తయ్యాయి. ‘‘2020–21లో పబ్లిక్‌ ఇష్యూల ద్వారా రూ.46,030 కోట్లు, రైట్స్‌ ఇష్యూల ద్వారా రూ.64,059 కోట్లను సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2019–20) ఇది రూ.21,382 కోట్లు, రూ.55,670 కోట్లుగా ఉంది. 115 శాతం, 15% చొప్పున వృద్ధి నమోదైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top