Shopping Mall: షాపింగ్‌ మాల్స్‌ ఢమాల్‌!

Shopping mall owners income dips around 50 percent in FY21 - Sakshi

సగానికి పడిన రెంటల్‌ ఆదాయం

గతేడాది మార్చి నుంచి తిరోగమనం

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి విస్తృతి కారణంగా రిటైల్‌ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో షాపింగ్‌ మాల్స్‌ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి పడిపోయిందని రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్, కన్సల్టెంట్స్‌ చెబుతున్నారు. ఎనమిది నగరాల్లో సగటున షాపింగ్‌ సెంటర్లలో అద్దెలు నెలకు 4–5 శాతం తగ్గుతున్నాయి. చాలా మాల్స్‌లో 25 శాతం వరకు అద్దెలు దిగొచ్చాయి. కనీస ఆదాయ గ్యారంటీ ప్రాతిపదికన రిటైలర్లతో మాల్‌ యజమానులు సాధారణంగా లీజ్‌ ఒప్పందం చేసుకుంటారు. అయితే గతేడాది లాక్‌డౌన్‌ కాలంలో పూర్తిగా అద్దెలు మాఫీ అయ్యాయి.  

సెకండ్‌ వేవ్‌లోనూ..
లాక్‌డౌన్‌ ఎత్తేసిన నాటి నుంచి మార్చి వరకు మాల్‌ యజమానులు అద్దెలు తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో వారి మొత్తం ఆదాయం పడిపోయింది. సెకండ్‌ వేవ్‌లోనూ ఆదాయం సగానికి వచ్చి చేరిందని పసిఫిక్‌ గ్రూప్‌ ఈడీ అభిషేక్‌ బన్సల్‌ తెలిపారు. రెంటల్‌ ఆదాయం 40–50%కే పరిమితమైందని యునిటీ గ్రూప్‌ డైరెక్టర్‌ హర్‌‡్ష బన్సల్‌ చెప్పారు. కొత్తగా లీజుకిచ్చిన రిటైలర్ల నుంచి అద్దె తగ్గలేదని, అయినా పరిమిత కాలానికి డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ మాల్స్‌ యజమానుల ఆదాయం 40–50 శాతం పడిపోతుందని కుష్‌మన్, వేక్‌ఫీల్డ్‌ చెబుతోంది.  

ఇతర ఆదాయాలూ తగ్గాయి..
మొత్తం రెంటల్‌ ఆదాయంలో మల్టీప్లెక్సుల వాటా 15%. ఇప్పుడు వీటినుంచి ఆదాయం పూర్తిగా రావడం లేదని జేఎల్‌ఎల్‌ ఇండియా రిటైల్‌ సర్వీసెస్‌ ఎండీ శుభ్రాన్షు పాని పేర్కొన్నారు. అద్దెలే కాకుండా పార్కింగ్, పాప్‌–అప్‌ స్టోర్స్, ప్రకటనల ఆదాయమూ కోల్పోయారని సావిల్స్‌ ఇండియా డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ సింగ్‌ తెలిపారు. గతేడాది మార్చి నుంచి వినియోగదార్లలో సెంటిమెంట్‌ పడిపోవడమూ ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. మాల్స్‌ పుంజుకుంటున్న సమయంలో సెకండ్‌ వేవ్‌ ముప్పులా పరిణమించిందని చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top