టెక్నాలజీ వ్యాపారవేత్తలుగా మహిళలు

Sheatwork and Techarc unveil report on State of Women Tech Entrepreneurship in India - Sakshi

మెట్రోయేతర నగరాల్లో ఎక్కువగా ఆసక్తి

సాంకేతిక వనరులు, ఇన్‌ఫ్రా సమస్యలతో అవరోధాలు

కార్పొరేట్‌ ఉద్యోగాలకు మెట్రో మహిళల ఓటు

టెక్‌ఆర్క్, షీట్‌వర్క్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని మహిళలు ఎక్కువగా టెక్నాలజీ వ్యాపారవేత్తలుగా మారడంపై ఆసక్తిగా ఉన్నారు. అయితే, సాంకేతిక వనరులు, మౌలిక సదుపాయాల కొరత, దిశానిర్దేశం చేసే మెంటార్లు దొరక్కపోవడం వారికి ప్రధాన అవరోధంగా ఉంటోంది. టెక్నాలజీ అనలిటిక్స్‌ సంస్థ టెక్‌ఆర్క్, మహిళల ప్లాట్‌ఫామ్‌ షీట్‌వర్క్‌ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయాయి.

దీని ప్రకారం నాన్‌–మెట్రో నగరాల్లోని మహిళల్లో దాదాపు 48 శాతం మంది .. తమ కెరియర్‌ ఆప్షన్‌గా టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఎంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నారు. మెట్రో నగరాల్లో తమ సొంత వెంచర్లను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి సంఖ్య 23 శాతం మాత్రమే ఉంది. మెట్రో నగరాల్లోని మహిళలు.. సౌకర్యవంతమైన కెరియర్‌ కోసం ఎక్కువగా కార్పొరేట్‌ ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. ‘భారత్‌లో మహిళా టెక్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ స్థితిగతులు‘ అనే అంశంపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 2,000 మంది పైచిలుకు పాల్గొన్నారు. వీరిలో ప్రొఫెషనల్స్, విద్యార్థులు, స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు.  

ఐఐటీల్లో పెరిగిన విద్యార్థినులు..
ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల్లో విద్యార్థినుల సంఖ్య గడిచిన నాలుగేళ్లలో గణనీయంగా పెరిగింది. అప్పట్లో ఇది కేవలం 5 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 16 శాతానికి చేరింది. కానీ వీరంతా సొంతంగా టెక్‌ కంపెనీలను ప్రారంభించే దిశగా వెళ్లడం లేదు. ‘మెట్రోయేతర నగరాల్లోని 73 శాతం మంది మహిళలు .. అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే .. తాము ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఎంచుకోలేకపోతున్నామని తెలిపారు. మెట్రోల్లో 22 శాతం మంది మహిళలు భౌతిక ఇన్‌ఫ్రా కొరత తమకు సమస్యగా ఉంటోందని పేర్కొన్నారు‘ అని నివేదిక వెల్లడించింది.

ఇక పురుషులతో పోలిస్తే నిధులు సమీకరించడం, పెట్టుబడులను సమకూర్చుకోవడం కష్టతరంగా ఉంటోందని సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది చెప్పారు. ‘విద్యావంతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంబంధిత వ్యాపార, సాంకేతిక వనరులు పరిమిత స్థాయిలోనే ఉండటమనేది వారి వెంచర్‌లను విస్తరించడంలో అవరోధంగా ఉంటోంది. టెక్నాలజీ కొరత ప్రధాన సవాలుగా ఉంటోందని మెట్రోయేతర నగరాల్లోని 74 శాతం మంది తెలిపారు. మహిళా వ్యాపారవేత్తలు తమ వెంచర్లలో విజయం సాధించాలంటే టెక్నాలజీ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని మెట్రో నగరాల్లో 24 శాతం మంది చెప్పారు‘ అని నివేదిక పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top