70,000 వాలా!

Sensex scales 70,000 peak for first time in early trade, Nifty crosses 21,000 points - Sakshi

కొత్త శిఖరంపై సెన్సెక్స్‌

కొనసాగిన రికార్డుల ర్యాలీ.. 21 వేల చేరువలో నిఫ్టీ ముగింపు

రాణించిన మెటల్, ఐటీ షేర్లు

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ రికార్డు ర్యాలీలో భాగంగా సెన్సెక్స్‌ సరికొత్త మైలురాయిని తాకింది.  44 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి 70,000 పాయింట్లను తాకింది. మరో సూచీ నిఫ్టీ 21,000 శిఖరానికి కేవలం 3 పాయింట్ల దూరంలో నిలిచింది. కొంతకాలంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది., ఆర్‌బీఐ వరుసగా అయిదోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు దేశీయ వృద్ధి అవుట్‌లుక్‌ను పెంచింది.

అయిదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. ప్రాథమిక మార్కెట్లు ఐపీఓలతో కళకళలాడుతున్నాయి. దీంతో కొన్ని వారాలుగా దలాల్‌ స్ట్రీట్‌లో కొనుగోళ్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ నిఫ్టీలు కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయి. యూఎస్‌ ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌ఓఎంసీ) నిర్ణయాలు బుధవారం వెలువడనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్తబ్దుగా ట్రేడవుతున్నాయి.  

ఒడిదుడుకులున్నా.., సరికొత్త శిఖరాలకు ....  
ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు పెరిగి 69,926 వద్ద, నిఫ్టీ నాలుగు పాయింట్లు నష్టపోయి 20,965 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్‌ షేర్లకు రాణించడంతో ప్రథమార్ధంలోనే  232 పాయింట్లు పెరిగి 70,000 స్థాయిపై 70,058 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు బలపడి 21,026 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి.

అయితే ద్వితీయార్ధంలో రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు కొంతమేర లాభాలు కొల్పోయాయి. చివరికి సెన్సెక్స్‌ 103 పాయింట్ల లాభంతో 69,929 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు బలపడి 21,000 శిఖరానికి కేవలం 3 పాయింట్ల దూరంలో 20,997 నిలిచింది. ‘‘కొత్త ఏడాదికి సరిగ్గా 20 రోజుల ముందు సెన్సెక్స్‌ 70 వేల పాయింట్ల ధమాకా ఇచి్చంది.

అయితే నేడు(మంగళవారం) అమెరికా, భారత్‌ల నవంబర్‌ ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ)డేటా వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. మరో ఏడాది కాలంలో సెన్సెక్స్‌ 80 వేల స్థాయిని అందుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మౌలిక, ప్రభుత్వ రంగాల షేర్లు ర్యాలీకి ప్రాతినిథ్యం వహించవచ్చు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లో కొంత అస్థిరతర ఉండొచ్చు.’’ అని మార్కెట్‌ నిపుణుడు విజయ్‌ కేడియా తెలిపారు.  
 
మార్కెట్లో మరిన్ని సంగతులు
► నిధుల సమీకరణ, ఎన్‌ఎస్‌ఈ ఎక్సే్చంజీలో లిస్టింగ్‌ ప్రణాళికల నేపథ్యంలో స్పైస్‌జెట్‌ షేరు. బీఎస్‌ఈలో 10%పైగా లాభపడి రూ.60.57 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 16% ఎగసి రూ.63.69 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది.
► అమెరికా నియంత్రణ సంస్థ హైదరాబాద్‌ రీసెర్చ్‌ ఫ్యాకల్టీ యూనిట్‌కు 3 అభ్యంతరాలు జారీ చేయడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ 5% నష్టపోయి రూ.5,473 వద్ద స్థిరపడింది.
► ఓఎన్‌జీసీ నుంచి రూ.1,145 కోట్ల ఆర్డరు దక్కించుకోవడంతో మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ షేరు 3% పెరిగి రూ.2118 వద్ద నిలిచింది.  
► సెన్సెక్స్‌ 65,000 స్థాయి నుంచి 70,000 పాయింట్లకు చేరేందుకు కేవలం 110 రోజుల సమయం పట్టింది.  
► 1979లో 100 పాయింట్ల వద్ద తన ప్రయాణాన్ని ప్రారంభించిన సెన్సెక్స్‌ ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 70 వేల స్థాయికి చేరుకుంది. అంటే 44 ఏళ్లలో సెన్సెక్స్‌ ఇన్వెస్టర్లకు 700 రెట్ల లాభాలు పంచింది.  
► సెన్సెక్స్‌ కొత్త రికార్డు స్థాయి నెలకొల్పడంతో  సోమవారం రూ.1.85 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో  ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.351.09 లక్షల కోట్లకు చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top