నాన్‌స్టాప్‌.. సెన్సెక్స్‌ప్రెస్‌!

Sensex plunges over 1000 points andd Nifty breaks below 14,000 mark - Sakshi

నాలుగో రోజూ లాభాలే

సెన్సెక్స్‌ లాభం 359 పాయింట్లు

14,896 వద్ద నిలిచిన నిఫ్టీ

ఆర్‌బీఐ ప్రకటన వైపు మార్కెట్‌ చూపు

రాణించిన బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు  

ఐటీ షేర్లకు కష్టాలు

ముంబై: స్టాక్‌ మార్కెట్లో బడ్జెట్‌ ర్యాలీ గురువారం కూడా కొనసాగడంతో సూచీలు నాలుగో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చనే ఆశలు మార్కెట్‌ వర్గాల్లో నెలకొన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి నికర కొనుగోలుదారులుగా మారారు. మూడో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్న కార్పొరేట్‌ కంపెనీల గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదవుతున్నాయి. ఈ సానుకూల పరిణామాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 359 పాయింట్లు లాభపడి 50,614 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 106 పాయింట్లు ఎగసి 14,896 పాయింట్ల వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి.

నష్టాల్లోంచి లాభాల్లోకి...!
ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో పాటు మూడు రోజుల భారీ లాభాల నేపథ్యంలో ఉదయం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఫలితంగా సెన్సెక్స్‌ 330 పాయింట్లు కోల్పోయి 49,926 స్థాయికి, నిఫ్టీ 75 పాయింట్లు పతనమై 14,715 వద్దకి చేరుకున్నాయి. అయితే మిడ్‌ సెషన్‌ తర్వాత బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాలతో పాటు కీలక రంగాల షేర్లలో మళ్లీ కొనుగోళ్లు జరగడంతో సూచీలు నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 50,688 వద్ద, నిఫ్టీ 14,914 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి.  

మార్కెట్‌ చూపు ఆర్‌బీఐ ప్రకటన వైపు ...  
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భేటీ నిర్ణయాలు శుక్రవారం (ఫిబ్రవరి 5న) విడుదల అవుతాయి. ఈసారి కూడా ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకపోవచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే బడ్జెట్‌ 2021 పై, ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం తదితర అంశాలపైన ఆర్‌బీఐ గవర్నర్‌ చేసే వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. మార్కెట్‌ తదపరి గమనం ఆర్‌బీఐ నిర్ణయంపైనా ఆధారపడి ఉంటుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.  

మార్కెట్లో మరిన్ని సంగతులు...  
► ఐటీసీ షేరు 6% పైగా ఎగసి రూ.230 వద్ద ముగిసింది.
►   జనవరిలో ట్రాక్టర్‌ అమ్మకాలు పెరగడంతో మహీంద్రా 4 శాతం ర్యాలీ చేసింది.  
►    డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు బాగుండటంతో బజాజ్‌ కన్జూమర్‌ షేరు 3 శాతం పెరిగింది.  
►  మెరుగైన ఫలితాలతో ప్రిన్స్‌ పైప్స్‌ 19% లాభపడింది.

ఇన్వెస్టర్ల సంపద @ రూ.200 లక్షల కోట్లు
కేంద్రం ప్రవేశపెట్టిన వృద్ధి ప్రోత్సాహక బడ్జెట్‌ ఈక్విటీ మార్కెట్‌ను మెప్పించడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు రోజుకో సరికొత్త రికార్డును లిఖిస్తున్నాయి. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) గురువారం తొలిసారి రూ.200 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్‌ ముగిసేసరికి రూ.200.47 లక్షల కోట్ల వద్ద నిలిచింది. బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ విలువ 2014 నవంబర్‌ 28న తొలిసారి రూ.100 లక్షల కోట్లను అందుకుంది. బీఎస్‌ఈ ఎక్సే్చంజ్‌లో లిస్టయిన మొత్తం కంపెనీల సంఖ్య 3,128 ఉండగా, నమోదిత ఇన్వెస్టర్లు 6 కోట్ల మందికి పైగా ఉన్నట్లు బీఎస్‌ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశ సంపద సృష్టిలో బీఎస్‌ఈ ఎక్సే్చంజ్‌ ప్రధాన భూమిక పోషిస్తుండటం తమకెంతో సంతోషాన్నిస్తుందని ఎక్సే్చంజ్‌ సీఈవో ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ తెలిపారు. వర్ధమాన దేశాల ఎక్సే్చంజ్‌లు ఈ మార్కెట్‌ క్యాప్‌ విషయంలో బీఎస్‌ఈ దరిదాపుల్లో కూడా లేవని ఆయన పేర్కొనారు. నమోదిత కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ విలువ పరంగా ప్రపంచదేశాల ఎక్సే్చంజ్‌ల్లో బీఎస్‌ఈ ఎక్సే్చంజ్‌ తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నట్లు ఆశిష్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top