Stock Market News Telugu: Sensex Falls 554 Pts Nifty Below 18,200 Auto IT Metal Pharma Drag - Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలో అతిపెద్ద నష్టం

Published Wed, Jan 19 2022 4:13 AM

Sensex falls 554 pts Nifty below 18,200 auto IT metal pharma drag - Sakshi

ముంబై: ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్‌ సూచీలు చివరి గంటలో లాభాల స్వీకరణతో మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఈ కొత్త ఏడాది(2022)లో అతిపెద్ద నష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 554 పాయింట్లు పతనమై 60,755 వద్ద నిలిచింది. నిఫ్టీ 195 పాయింట్లు క్షీణించి 18,113 వద్ద స్థిరపడింది. ఆటో, ఐటీ, టెలికాం, కన్జూమర్, మెటల్, రియల్టీ రంగాల చిన్న, మధ్య తరహా షేర్లు అత్యధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు వరుసగా రెండున్నర శాతం, రెండు శాతం క్షీణించాయి. సెన్సెక్స్‌ సూచీలోని 30 షేర్లకు గానూ 23 షేర్లు నష్టపోయాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 33 పైసలు క్షీణించి 74.58 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1255 కోట్ల షేర్లను దేశీయ ఇన్వెస్టర్లు రూ.220 కోట్ల షేర్లను అమ్మేశారు. ఆసియా, యూరప్‌ దేశాల స్టాక్‌ సూచీలు ఒకటి నుంచి ఒకటిన్నర శాతం పతనమయ్యాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం అరశాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.   

నష్టాలు ఎందుకంటే..? 
అరబ్‌ దేశాల్లో అల్లర్లు చెలరేగడంతో సరఫరా ఆందోళనలు తెరపైకి వచ్చి అంతర్జాతీయంగా బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయి 87 డాలర్లను తాకింది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధమైన నేపథ్యంలో ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లతో పాటు గత రెండు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి దేశీయ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆకస్మిక సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ వరుసగా మూడోరోజూ 33 పైసలు క్షీణించింది. ఈ పరిణామాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలను ప్రేరేపించాయి. 

రూ.3.71 లక్షల కోట్లు ఆవిరి 
స్టాక్‌ సూచీల భారీ నష్టంతో ఇన్వెస్టర్లు మంగళవారం ఒక్కరోజే రూ. 3.71 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాప్‌ (విలువ) రూ.276.30 లక్షల కోట్లకు చేరింది. 

మార్కెట్లో మరిన్ని సంగతులు 
♦డిసెంబర్‌ క్వార్టర్‌లో రెండింతల బుకింగ్స్‌ను సాధించినట్లు ప్రకటించడంతో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ షేరు బీఎస్‌ఈలో మూడు శాతం లాభంతో రూ. 530 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఎనిమిది శాతం బలపడి ఏడాది గరిష్ట స్థాయి రూ.555 వద్ద స్థిరపడింది. 
♦టెలికాం గేర్‌ మేకర్‌ హెచ్‌ఎఫ్‌సీఎల్‌ షేరు ఏడు శాతం క్షీణించి రూ.89 వద్ద ముగిసింది. మూడో క్వార్టర్‌లో ఆదాయం ఏడు శాతం క్షీణించడం షేరు పతనానికి కారణమైంది.  
♦స్టాక్‌ మార్కెట్లో అనిశ్చితిని సూచించే వీఐఎక్స్‌ ఇండెక్స్‌ ఆరుశాతం ఎగసి 17.78 స్థాయికి చేరుకుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement