రికార్డుల హోరు

Sensex ends 139 points higher and Nifty above 13,500 - Sakshi

ఆగని రికార్డుల పరుగు 

సెన్సెక్స్‌ లాభం 154 పాయింట్లు

13,550 పైన నిఫ్టీ ముగింపు 

రాణించిన ఇంధన, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్‌ షేర్లు 

ఆటో, రియల్టీ షేర్లలో అమ్మకాలు 

మెప్పించిన టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు

ముంబై: ఇంధన, మౌలిక, బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారమూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. ఇంట్రాడేలో వెలువడిన అక్టోబర్‌ నెల టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు ఇన్వెస్టర్లను మెప్పించగలిగాయి. అలాగే రూపాయి బలపడడం, కొనసాగిన విదేశీ పెట్టుబడుల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 154 పాయింట్ల లాభంతో 46,253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 13,558 వద్ద ముగిసింది. ఈ స్థాయిలు సూచీలకు కొత్త జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. మరోవైపు ఆటో, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 46,373 వద్ద గరిష్టాన్ని, 45,951 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 13,597–13,472 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నగదు విభాగంలో సోమవారం ఎఫ్‌ఐఐలు రూ.2,264 కోట్ల షేర్లను
కొనగా, దేశీయ ఫండ్స్‌ (డీఐఐ) రూ.1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీశారు. ఇక డాలర్‌ మారకంలో రూపాయి 9 పైసలు బలపడి 73.55 వద్ద స్థిరపడింది.  అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ వాడకానికి అనుమతులు లభించడంతో పాటు బ్రెగ్జిట్‌ ట్రేడ్‌ డీల్‌పై బ్రిటన్‌–ఈయూల మద్య జరిగే చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే అంచనాలతో  అంతర్జాతీయ మార్కెట్లలో సాను కూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో ప్రధాన మార్కెట్లతో పాటు యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.  

బర్గర్‌ కింగ్‌ బంపర్‌ లిస్టింగ్‌
ఫాస్ట్‌ఫుడ్‌ చైన్ల దిగ్గజం బర్గర్‌ కింగ్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లో బంపర్‌ హిట్‌ను సాధించాయి. ఇష్యూ ధర రూ. 60తో పోలిస్తే బీఎస్‌ఈలో 92% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయ్యాయి. చివరకు 130% లాభంతో రూ.138 వద్ద స్థిరపడ్డాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 5,282.10 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈలో 191.55 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 18.67 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇటీవలే ముగిసిన ఈ కంపెనీ ఐపీఓ 157 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. బర్గర్‌ కింగ్‌ కంపెనీ 2020 సెప్టెంబర్‌ నాటికి భారత్‌లో 268 దుకాణాలను కలిగి ఉంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top