మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌

Sensex and Nifty log first gain in four sessions - Sakshi

రోజంతా హెచ్చుతగ్గులు 

చివరి గంటలో స్థిరంగా కొనుగోళ్లు 

173 పాయింట్ల లాభంతో 38,051కు సెన్సెక్స్‌ 

69 పాయింట్లు పెరిగి 11,247కు  నిఫ్టీ

రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు లాభాల్లో ముగిశాయి. దీంతో గత మూడు రోజుల నష్టాలకు సోమవారం బ్రేక్‌ పడింది.  అమెరికా ఉద్దీపన ప్యాకేజీ జాప్యం అవుతుండటంతో అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా మన మార్కెట్‌ మాత్రం పెరిగింది. సెన్సెక్స్‌ మళ్లీ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,200 పాయింట్లపైకి ఎగబాకాయి. చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగడం కలసివచ్చింది.  సెన్సెక్స్‌ 173 పాయింట్ల లాభంతో 38,051 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 11,247 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్‌ షేర్లు నష్టపోయినా,విద్యుత్తు, వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ,  లోహ  షేర్లు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు పుంజుకొని 74.88 వద్దకు చేరింది.   

ఐదు  సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి...
సెన్సెక్స్‌ లాభాల్లోనే మొదలైనా వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మళ్లీ లాభాల్లోకి వచ్చింది. రోజంతా లాభ, నష్టాల మధ్య ట్రేడైంది. సెన్సెక్స్‌ ఐదు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చిందంటే ఒడిదుడుకులు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 143 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ మరో దశలో 242 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 385 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  జపాన్‌ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి.
 
► ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, త్వరలో పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ను ఆరంభించనున్నదన్న వార్తలతో ఎన్‌టీపీసీ షేర్‌ 8 శాతం లాభంతో రూ.95 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే.  
► 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్, మైండ్‌ ట్రీ, వాబ్‌కో ఇండియా, థైరోకేర్‌ టెక్నాలజీస్‌  తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
► అంతర్జాతీయ రీసెర్చ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ కొనొచ్చు అనే రేటింగ్‌ను ఇవ్వడంతో సన్‌ టీవీ  షేర్‌ 6% లాభంతో రూ.426 వద్ద ముగిసింది.  
► మొత్తం 30 సెన్సెక్స్‌ షేర్లలో ఐదు–ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ ఫార్మా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ మాత్రమే నష్టపోగా, మిగిలిన 25 షేర్లు లాభపడ్డాయి.  
► హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ షేర్లు కొనుగోలు చేశారన్న వార్తలతో పీటీసీ  ఇండస్ట్రీస్‌ 20% లాభంతో రూ.699 కు చేరింది.  
► దాదాపు 400 షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. పీటీసీ ఇండస్ట్రీస్, ఆప్టో సర్క్యూట్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top