
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్చంజీలు, ఇతరత్రా మార్కెట్ ఇన్‌ఫ్రా సంస్థలు పాటించాల్సిన సైబర్ సెక్యూరిటీ నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింత కఠినతరం చేసింది. స్టాక్ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు మొదలైన మార్కెట్ ఇన్‌ఫ్రా సంస్థలు (ఎంఐఐ) ఇకపై ప్రతీ ఆర్థిక సంవత్సరంలో కనీసం 2 సార్లు సమగ్రమైన సైబర్ ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
సైబర్ ఆడిట్ నివేదికలతో పాటు నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామంటూ ఆయా సంస్థల ఎండీ, సీఈవోలు ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో తెలిపింది. సవరించిన నిబంధనల ప్రకారం వ్యాపార కార్యకలాపాలు, డేటా మేనేజ్‌మెంట్, సర్వీసుల నిర్వహణలో కీలకమైన అసెట్లను వాటి ప్రాధాన్యత ప్రకారం వర్గీకరించాలి. సైబర్ ఆడిట్ల (వీఏపీటీ) నిర్వహణ పూర్తయిన నెల రోజుల్లోగా సెబీకి నివేదిక సమర్పించాలి.