
న్యూఢిల్లీ: ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) బాకీల నుంచి మినహాయింపు కోరుతూ వొడాఫోన్, ఎయిర్‌టెల్, టాటా టెలీసరీ్వసెస్ దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చుంది. ఒక బహుళ జాతి కంపెనీ ఇలాంటి పిటీషన్ వేయడం తమను షాక్‌కి గురి చేసిందని వ్యాఖ్యానించింది. ఒకవేళ ప్రభుత్వం తనంతట తాను ఏదైనా సహాయం చేయదల్చుకుంటే న్యాయస్థానం జోక్యం చేసుకోబోదని తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే.. టెలికం సంస్థలు లైసెన్సింగ్, స్పెక్ట్రం వినియోగ ఫీజుల కింద నిర్దిష్ట మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం టెలికం సేవలతో పాటు టెల్కోలకు వచ్చే ఇతరత్రా వనరుల నుంచి కూడా వచ్చే ఆదాయాన్ని వాటి మొత్తం ఆదాయంగా (ఏజీఆర్) నిర్వచిస్తూ, దాని ప్రాతిపదికగా చెల్లింపులు జరపాలంటూ ప్రభుత్వం, న్యాయస్థానం గతంలో సూచించడం వివాదానికి దారి తీసింది.
ఏజీఆర్‌పరమైన బకాయిలను తప్పుగా లెక్కించడం వల్ల తమపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగిపోతుందని, దీన్ని మినహాయించాలని లేదా పునఃసమీక్షించాలని న్యాయస్థానాన్ని టెల్కోలు ఆశ్రయించాయి. రూ. 30,000 కోట్ల బాకీల నుంచి మినహాయింపునివ్వాలంటూ వొడాఫోన్ కోరింది. గత ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వం సహాయం చేయలేకపోతోందన్న పిటీషనర్ వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచి్చంది. జూలై వరకు వాయిదా వేయాలని లేదా ఉపసంహరించుకునేందుకు అనుమతించాలన్న అభ్యర్ధనలను పక్కన పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా సహాయం చేయదలిస్తే న్యాయస్థానం అడ్డుకోబోదని స్పష్టం చేసింది.