సహారా ఇష్యూ కొనసాగుతుంది

Sahara Matter To Continue Even After Subrata Roy Death - Sakshi

సెబీ చైర్‌పర్శన్‌ మాధవీ పురి బుచ్‌ స్పష్టీకరణ

ముంబై: గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్‌ మరణించినప్పటికీ సహారా అంశం కొనసాగనున్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్‌ మాధవీ పురి బుచ్‌ పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో 75ఏళ్ల రాయ్‌ మంగళవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. సహారా అంశం కంపెనీకి సంబంధించినదని,  వ్యక్తులతో సంబంధం లేకుండా ఈ ఇష్యూ కొనసాగుతుందని తెలియజేశారు. ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా విలేకరులకు బుచ్‌ ఈ విషయాలు వెల్లడించారు.

సహారా ఇన్వెస్టర్లకు వాపసు చేయాల్సిన రూ. 25,000 కోట్లు సెబీ ప్రత్యేక ఖాతాల్లోనే ఉండగా, రాయ్‌ మరణించిన నేపథ్యంలో బుచ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆధారాలున్న ఇన్వెస్టర్ల క్లయిములకు అనుగుణంగా సుప్రీం కోర్టు నియమిత కమిటీ సొమ్ములు వాపసు చేస్తున్నట్లు బుచ్‌ తెలియజేశారు. వివరాల్లోకి వెడితే.. సహారా గ్రూప్‌లో భాగమైన సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌(ఎస్‌ఐఆర్‌ఈసీఏ), సహారా హౌసింగ్‌ కార్పొరేషన్‌ సంస్థలు .. ఓఎఫ్‌సీడీల (డిబెంచర్లు) ద్వారా 2007–08లో ఇన్వెస్టర్ల నుంచి నిధులను సేకరించడం వివాదాస్పదమైంది.

దీనితో పోంజీ స్కీముల ఆరోపణల మీద సహారా గ్రూప్‌ 2010 నుంచి సమస్యల్లో చిక్కుకుంది. ఆపై 2014లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాయ్‌ను అరెస్ట్‌ చేశారు. గ్రూప్‌ కంపెనీలు రెండింటికి సంబంధించి ఇన్వెస్టర్లకు రూ. 20,000 కోట్లు వాపస్‌ చేయకపోవడంతోపాటు .. కోర్టుముందు హాజరుకావడంలో విఫలం చెందడంతో రాయ్‌ అరెస్ట్‌ అయ్యారు. తదుపరి రాయ్‌ బెయిల్‌ పొందినప్పటి కీ గ్రూప్‌ కంపెనీల సమస్యలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు రిఫండ్‌ చేయడానికి, న్యాయస్థానం ఆదేశాల మేరకు  సెబీ ప్రత్యేక ఖాతాల్లోకి సహారా గ్రూప్‌ రూ. 24,000 కోట్లు జమ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top