
సాక్షి, సిటీబ్యూరో: ఆటో రిక్షా ధరలను రవాణాశాఖ ఖరారు చేసింది. ఎల్పీజీ ఆటో రిక్షా ధరను రూ.2.70 లక్షలుగా, సీఎన్జీ ఆటో రిక్షా ధరను రూ.2.80 లక్షలుగా నిర్ణయించింది. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఫైనాన్షియర్‌లు, కన్సల్టెంట్‌లు కుమ్మక్కై అడ్డగోలుగా ధరలు పెంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసారి అలాంటి బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం లేకుండా నియంత్రించింది.
ఓఆర్‌ఆర్ పరిధిలో నడిపేందుకు వీలుగా సుమారు 65 వేల ఆటో పర్మిట్‌లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు కాగా, మరో 20వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు సైతం అనుమతినిచ్చారు. ఇప్పటికే సీఎన్జీ లేదా ఎల్పీజీతో నడుస్తున్న సుమారు 25 వేల ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు అవకాశం కల్పించారు.
20 వేల ఆటోలకు ప్రొసీడింగ్‌లు..
అర్హులైన ఆటోడ్రైవర్‌లు దరఖాస్తు చేసుకొనేందుకు షోరూమ్‌లలోనే ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న డ్రైవర్ల వివరాలను పరిశీలించి కొత్త ఆటోలు కొనుగోలు చేసేందుకు ప్రొసీడింగ్‌లు (అనుమతులను) ఇచ్చారు. ఇప్పటి వరకు సుమారు 20 వేల ఆటోరిక్షాలకు అనుమతులను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
రంగంలోకి కన్సల్టెంట్‌లు...
ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు ప్రొసీడింగ్‌ల ప్రక్రియ ముగింపు దశకు చేరడంతో ఫైనాన్షియర్‌లు, కన్సల్టెంట్‌లు రంగంలోకి దిగారు. అక్రమార్జనకు తెరలేపారు. షోరూమ్‌లలో ధరలను ఖరారు చేసినట్లుగా ఫైనాన్షియర్‌ల అక్రమాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆటోరిక్షా విక్రయాల్లో ఫైనాన్షియర్‌లు, కన్సల్టెంట్‌ల మోసాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.