
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల రిటైలింగ్ సంస్థ ఆర్‌ఎస్‌బీ రిటైల్ ఇండియా (ఆర్‌ఎస్ బ్రదర్స్) పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.98 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద ప్రమోటర్లు విక్రయించనున్నారు.
ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 275 కోట్లను నిర్దిష్ట రుణాల చెల్లింపునకు, రూ. 118 కోట్ల మొత్తాన్ని ఆర్‌ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్ ఫార్మాట్లలో కొత్త స్టోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మొత్తం 73 స్టోర్స్ ఉన్నాయి. సౌతిండియా షాపింగ్ మాల్, ఆర్‌ఎస్ బ్రదర్స్, కాంచీపురం నారాయణి సిల్క్స్, డి రాయల్, వేల్యూ జోన్ హైపర్‌మార్ట్ పేరిట వివిధ ఫార్మాట్లలో స్టోర్స్ నిర్వహిస్తోంది. పొట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజమౌళి, తిరువీధుల ప్రసాద రావు తదితరులు ప్రమోటర్లుగా ఉన్నారు. 2024–25లో కంపెనీ రూ. 2,694 కోట్ల ఆదాయం, రూ. 104 కోట్ల లాభం నమోదు చేసింది.