
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో రిజిస్టర్ చేసుకున్న మొదటిసారి ఉద్యోగులు అంటే ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నవారికి కొత్తగా ప్రారంభిస్తున్న పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎం-వీబీఆర్‌వై) కింద రూ.15,000 లభిస్తాయి.
ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ)గా పిలిచే ఈ పథకానికి రూ.99,446 కోట్ల బడ్జెట్‌తో కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. పీఎం-వీబీఆర్‌వై పథకం యాజమాన్యాలకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ప్రోత్సహిస్తుంది. వివిధ రంగాల్లో, ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగావకాశాలను పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. ఉపాధి ఆధారిత అభివృద్ధి ద్వారా భారత ఆర్థిక వృద్ధిని నడిపించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది.
పథకం అమలు తీరు ఇలా..
ఈ పథకం రెండు విధాలుగా ప్రోత్సాహాలు అందిస్తుంది. ఒకటి మొదటిసారి ఉద్యోగుల కోసం, మరొకటి యజమానుల కోసం. ఈ భాగం మొదటిసారిగా శ్రామిక శక్తిలో చేరిన (ఈపీఎఫ్ఓలో నమోదై ఉండాలి) వారిని లక్ష్యంగా చేసుకుంటుంది. అర్హత కలిగిన ఉద్యోగులు (రూ .1 లక్ష వరకు వేతనం ఉన్నవారు) రూ .15,000 వరకు వన్ టైమ్ ఈపీఎఫ్ వేతన ప్రయోజనాన్ని పొందుతారు.
దీన్ని ఉద్యోగంలో చేరిన 6 నెలల తరువాత, మళ్లీ 12 నెలల నిరంతర సర్వీస్ తర్వాత రెండు వాయిదాలలో చెల్లిస్తారు. రెండో విడత పొందాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ పూర్తి చేయాలి. పొదుపు అలవాట్లను పెంపొందించడానికి ఈ ప్రోత్సాహకంలో కొంత భాగాన్ని పొదుపు ఖాతా లేదా సాధనానికి కేటాయిస్తారు. దాన్ని తరువాత ఉపసంహరించుకోవచ్చు.
ఇక కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్న యాజమాన్యాలకూ ఈ పథకం కింద ప్రోత్సాహాలు ఉంటాయి. ముఖ్యంగా తయారీ రంగంలో కొత్త కార్మికులను నియమించుకునే యాజాన్యాలకు కనీసం ఆరు నెలల పాటు ఉద్యోగంలో కొనసాగే ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ మద్దతు రెండు సంవత్సరాలు కొనసాగుతుంది. అదే తయారీ యూనిట్లకు అయితే ప్రోత్సాహక కాలాన్ని మూడు, నాల్గవ సంవత్సరాలకు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది.
ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి,ఈపీఎఫ్ఓలో నమోదైన కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుని వారిని కనీసం ఆరు నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలైతే కనీసం ఇద్దరిని, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురిని కొత్తగా నియమించుకోవాలి.
ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్)ను ఉపయోగించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా తొలిసారి ఉద్యోగులకు చెల్లింపులు జరుగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో లబ్ధిదారు కంపెనీలకు ప్రోత్సాహకాలను నేరుగా ఆ సంస్థ పాన్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.