సాఫ్ట్‌వేర్ రంగం అంటే ఒకప్పుడు రాయల్ లైఫ్, భారీ ప్యాకేజీలు, నిరంతర అవకాశాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అపారమైన అనుభవం, అద్భుతమైన నైపుణ్యం ఉన్నప్పటికీ ఉద్యోగ వేటలో ఎదురవుతున్న సమస్యలు టెక్కీలను కుంగదీస్తున్నాయి. తాజాగా అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన ఒక సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
25 ఏళ్ల అనుభవం..
ఆండ్రూ అనే టెక్కీకి సాఫ్ట్‌వేర్ రంగంలో పాతికేళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఒక దశాబ్ద కాలం పాటు విజయవంతంగా వ్యాపారాలను నడిపిన ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ, గత కొంతకాలంగా ఆయన పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఏకంగా 2,000 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కనీసం ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాకపోవడం గమనార్హం.
‘నేను అసలు ఉద్యోగానికి పనికిరానా అని నాకే సందేహం కలుగుతోంది. నా 25 ఏళ్ల అనుభవాన్ని అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్ (ఏటీఎస్) ఫిల్టర్ చేసేస్తున్నాయా? లేదా నా రెజ్యూమె ఫార్మాట్‌లో లోపం ఉందా? ఏమీ అర్థం కావడం లేదు’ అంటూ ఆండ్రూ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు.
తిరస్కరిస్తున్న ఏఐ వ్యవస్థలు?
నేటి కార్పొరేట్ ప్రపంచంలో నియామక ప్రక్రియ అంతా ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ల (ఏటీఎస్) చేతుల్లో ఉంది. వందలాది ఈమెయిల్స్ పంపినా సుమారు 100 మంది హైరింగ్ మేనేజర్లను నేరుగా సంప్రదించినా ఆండ్రూకు ఒక్క స్పందన కూడా రాలేదు. అనుభవం ఎక్కువగా ఉండటం వల్ల జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న భయం కంపెనీల్లో ఉండవచ్చని లేదా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారా అనే చర్చ దీనితో మొదలైంది. ‘ఇది కేవలం నా కెరీర్ సమస్య మాత్రమే కాదు. నా జీవన ప్రమాణాలను, నన్ను నమ్ముకున్న వారిని ప్రభావితం చేస్తోంది. ఇక రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందేమో’ అని ఆండ్రూ వాపోయారు.
సోషల్ మీడియాలో సలహాలు
ఆండ్రూ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పలువురు నిపుణులు భిన్న సలహాలు ఇస్తున్నారు. ‘సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ నుంచి కన్సల్టింగ్, రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ బ్రోకరేజ్ వంటి రంగాలకు మారండి’ అంటు కొందరు సూచిస్తున్నారు. ‘మీ అనుభవంతో మరొకరికి ఉద్యోగం చేయడం కంటే మీరే యజమానిగా మారి స్టార్టప్ ప్రారంభించండి’ అని మరికొందరు సలహా ఇచ్చారు.
I have a hard time believing that I am just unhireable. But I have an even harder time believing that my 25 years of experience is somehow negated by the format of my resume.
But, after over 2,000 applications, I am not sure what else to think. And, out of the dozens of emails…— andrewthecoder (@_andrewthecoder) May 11, 2026
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా భారీగా లే-ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఎంట్రీ లెవల్, మిడ్ లెవల్ ఉద్యోగాల్లో పెను మార్పులు వస్తున్నాయి. ఆండ్రూ ఉదంతం కేవలం ఒక్క వ్యక్తి సమస్య మాత్రమే కాదు. గ్లోబల్ టెక్ మార్కెట్‌లో సీనియర్ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న అనిశ్చితికి అద్దం పడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా మానవ వనరుల విలువను కేవలం సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్స్‌తో అంచనా వేయడం వల్ల ఇలాంటి ప్రతిభావంతులు నిరాశకు గురవుతున్నారు. కంపెనీలు తమ నియామక ప్రక్రియను మరింత మానవీయ కోణంలో పునసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: సామ్ ఆల్ట్‌మాన్ ఓ నమ్మకద్రోహి!


