సామ్ ఆల్ట్‌మాన్‌ ఓ నమ్మకద్రోహి! | Elon Musk Vs OpenAI Legal Battle Reaches Critical Stage In High Stakes AI Courtroom Showdown, More Details Inside | Sakshi
Sakshi News home page

సామ్ ఆల్ట్‌మాన్‌ ఓ నమ్మకద్రోహి!

May 15 2026 10:17 AM | Updated on May 15 2026 11:25 AM

Elon Musk vs OpenAI Courtroom Showdown That Could Redefine AI Future

ప్రపంచ టెక్ రంగంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఎలాన్ మస్క్ వర్సెస్ ఓపెన్ ఏఐ న్యాయ పోరాటం కీలక దశకు చేరుకుంది. కృత్రిమ మేధ భవిష్యత్తును శాసించే ఈ కేసులో కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో గురువారం ముగింపు వాదనలు జరిగాయి. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఒక అబద్ధాల కోరు అని, లాభాపేక్ష లేని సంస్థను తన సొంత లాభాల కోసం వాడుకున్నారని మస్క్ తరఫు న్యాయవాదులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు, మస్క్ తీరును ‘సెలెక్టివ్‌ ఆమ్నేసియా’గా ఓపెన్ ఏఐ అభివర్ణించింది.

ముగింపు వాదనల్లోని ముఖ్యాంశాలు

మస్క్ తరఫు న్యాయవాది స్టీవెన్ మోలో వాదనలు వినిపిస్తూ, సామ్ ఆల్ట్‌మాన్ కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. మాజీ బోర్డు సభ్యులు, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సుట్స్‌కెవర్ సహా ఐదుగురు సాక్షులు ఆల్ట్‌మాన్ తీరును తప్పుబట్టారని గుర్తు చేశారు. ‘ఈ కేసులో సామ్ ఆల్ట్‌మాన్ విశ్వసనీయతే అసలు ప్రశ్న. మీరు అతడిని నమ్మకపోతే ఈ కేసులో ప్రతివాదులు గెలవలేరు’ అని మోలో జ్యూరీకి విన్నవించారు.

150 బిలియన్‌ డాలర్ల నష్టపరిహారం

ఓపెన్ ఏఐ సంస్థను మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలకు తాకట్టు పెట్టి సంస్థ అసలు ఆశయమైన మానవాళి సంక్షేమాన్ని విస్మరించారని మస్క్ ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన నష్టానికి గాను సుమారు 150 బిలియన్‌ డాలర్లు (రూ.12 లక్షల కోట్లకు పైగా) నష్టపరిహారాన్ని మస్క్ కోరుతున్నారు. ఈ మొత్తాన్ని లాభాపేక్ష లేని సంస్థకే చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రోక్‌మన్లను పదవుల నుంచి తొలగించాలని కోరారు.

ఓపెన్ ఏఐ ఎదురుదాడి

ఓపెన్ ఏఐ న్యాయవాది విలియం సావిట్ మస్క్ వాదనలను కొట్టిపారేశారు. ‘మస్క్‌కు కొన్ని రంగాల్లో అపారమైన ప్రతిభ ఉండొచ్చు కానీ, ఏఐ విషయంలో మాత్రం కాదు. ఇక్కడ గెలవాలంటే ఆయన చేయగలిగింది కేవలం కోర్టుకు రావడమే’ అని ఎద్దేవా చేశారు. ఏఐ రంగంలో మస్క్ వెనకబడిపోయారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సారా ఎడ్డీ వాదించారు.

‘సెలెక్టివ్ ఆమ్నేసియా’.. మస్క్‌పై విమర్శలు

2018లోనే సంస్థకు నిధుల అవసరం ఉందని మస్క్‌కు తెలుసని, అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు లాభాలు చూశాక కోర్టుకు రావడం వెనుక దురుద్దేశం ఉందని ఓపెన్ ఏఐ పేర్కొంది. ముఖ్యంగా కొన్ని కీలక పత్రాలను తాను చదవలేదని మస్క్ చెప్పడంపై న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యాపారవేత్తకు ‘సెలెక్టివ్ ఆ‍మ్నేసియా’ (కావాల్సినవి మాత్రమే గుర్తుంచుకోవడం) ఉందని విమర్శించారు.

మైక్రోసాఫ్ట్ పాత్రపై వివాదం

ఓపెన్ ఏఐ చేస్తున్న ప్రతి తప్పులోనూ మైక్రోసాఫ్ట్ భాగస్వామిగా ఉందని మస్క్ న్యాయవాదులు ఆరోపించారు. అయితే, తాము కేవలం బాధ్యతాయుతమైన పెట్టుబడిదారులమని, సంస్థ అంతర్గత నిర్ణయాల్లో జోక్యం లేదని మైక్రోసాఫ్ట్ న్యాయవాది రస్సెల్ కోహెన్ స్పష్టం చేశారు.

తదుపరి ఏం జరగబోతోంది?

ఈ కేసును విచారిస్తున్న తొమ్మిది మంది సభ్యుల జ్యూరీ సోమవారం నుంచి చర్చలు ప్రారంభించనుంది.

మస్క్ గెలిస్తే: ఓపెన్ ఏఐ బోర్డులో భారీ మార్పులు, భారీ జరిమానా, సంస్థను తిరిగి లాభాపేక్ష లేనిదిగా మార్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

మస్క్ ఓడిపోతే: ఓపెన్ ఏఐ తన 1 ట్రిలియన్ డాలర్‌ ఐపీఓ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది.

ఇదీ చదవండి: ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఒరాకిల్ షాక్

Advertisement
 
Advertisement
Advertisement