రైట్స్‌ బైబ్యాక్‌కు..  రైట్‌రైట్‌

RITES Ltd board approves buy back- MRPL to raise funds - Sakshi

ఒక్కో షేరుకీ రూ. 265 ధరలో బైబ్యాక్‌

దాదాపు 97 లక్షల షేర్ల కొనుగోలుకి రెడీ

రూ. 257 కోట్లను వెచ్చించేందుకు బోర్డు ఓకే

రూ. 5,000 కోట్ల సమీకరణ బాటలో ఎంఆర్‌పీఎల్‌ 

సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు ప్రభుత్వ రంగ కంపెనీ.. రైట్స్‌(RITES) లిమిటెడ్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బైబ్యాక్‌లో భాగంగా రూ. 265 ధర మించకుండా 9.69 మిలియన్‌ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 257 కోట్లను వెచ్చించనున్నట్లు మినీరత్న కంపెనీ రైట్స్‌ తాజాగా వెల్లడించింది. 2018 జులైలో లిస్టయిన ఈ పీఎస్‌యూలో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 72 శాతానికిపైగా వాటా ఉంది. కంపెనీ ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉన్నట్లు రైట్స్‌ చైర్మన్‌, ఎండీ రాజీవ్‌ మెహ్‌రోత్రా తెలియజేశారు. అంతేకాకుండా రుణరహిత కంపెనీ కావడంతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు తెరతీసినట్లు వివరించారు. ఇది కంపెనీ వృద్ధి అవకాశాలు, పటిష్టతపట్ల యాజమాన్యానికున్న నమ్మకానికి నిదర్శనమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా.. బైబ్యాక్‌కు ఈ నెల 30 రికార్డ్‌ డేట్‌గా బోర్డు నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా.. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో రైట్స్‌ షేరు 0.8 శాతం పుంజుకుని రూ. 255 వద్ద స్థిరపడింది.

ఎంఆర్‌పీఎల్‌
వారాంతాన జరిగిన వార్షిక సమావేశంలో భాగంగా రూ. 5,000 కోట్లవరకూ నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్‌(ఎంఆర్‌పీఎల్‌) తెలియజేసింది. ఇందుకు వీలుగా మార్పిడికి వీలుకాని డిబెంచర్లు(ఎన్‌సీడీలు), బాండ్లు తదితరాల జారీని చేపట్టే వీలున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంఆర్‌పీఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో శుక్రవారం దాదాపు యథాతథంగా రూ. 29 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top