ముంబై: రుణాల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న క్రెడిట్ స్కోరు గురించి తెలుసుకోవడంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం 18.3 కోట్ల మంది భారతీయులు తమ సిబిల్ స్కోరును స్వయంగా పరిశీలించుకుంటున్నారు.
తొలిసారిగా పరిశీలించుకునే వారి సంఖ్య గతేడాది డిసెంబర్ గణాంకాల ప్రకారం వార్షికంగా 27 శాతం పెరిగింది. క్రెడిట్ మానిటరింగ్ చేసుకుంటున్న వారి సగటు స్కోరు 728గా ఉంది. ఇలా పర్యవేక్షించుకుంటున్న వారిలో సుమారు 45 శాతం మంది ఆరు నెలల వ్యవధిలో తమ స్కోరును మరింత మెరుగుపర్చుకుంటున్నారు.
సాధారణంగా వ్యక్తిగత రుణాల్లాంటివి అవసరమైనప్పుడు మాత్రమే వినియోగదారులు స్కోరును తెలుసుకునే వారని, కానీ ప్రస్తుతం తరచుగా తెలుసుకోవడం, దాన్ని మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నారని సంస్థ ఎండీ భవేష్ జైన్ తెలిపారు. మిలీనియల్స్, జెన్ జెడ్ తరం, మహిళలు ఈ విషయంలో ముందుంటున్నారని పేర్కొన్నారు. మెట్రోయేతర ప్రాంతాల్లో స్కోరు ను పరిశీలించుకునే ధోరణి పెరుగుతోందన్నారు.


