పెట్టుబడుల్లో ‘రిటైల్‌’ దూకుడు

Rise Of The Retail Investor Indian Stock Market - Sakshi

ముంబై: ఈ క్యాలండర్‌ ఏడాది(2021) ప్రైమరీ మార్కెట్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల హవా నడిచింది. పబ్లిక్‌ ఇష్యూలకు సగటున 14.36 లక్షల దరఖాస్తులు లభించగా.. గతేడాది(2020)లో ఇవి 12.77 లక్షలుగా నమోదయ్యాయి. ఇక అంతక్రితం అంటే 2019లో సగటున రిటైలర్ల నుంచి 4.05 లక్షల దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి. ఐపీవోలలో గ్లెన్‌మార్క్‌ లైఫ్‌సైన్స్‌ 33.95 లక్షల అప్లికేషన్లతో అగ్రస్థానం వహించగా.. దేవయాని ఇంటర్నేషనల్‌కు 32.67 లక్షలు, లేటెంట్‌ వ్యూ ఎనలిటిక్స్‌కు 31.87 లక్షల బిడ్స్‌ వచ్చాయి. పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన కంపెనీలలో సిగాచీ ఇండస్ట్రీస్‌ ఏకంగా 270 శాతం లాభంతో లిస్ట్‌కాగా.. పరస్‌ డిఫెన్స్‌ 185 శాతం, లేటెంట్‌ వ్యూ 148 శాతం ప్రీమియంతో తొలి రోజు ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎస్‌ఎంఈ) ఇష్యూలు సైతం రెట్టింపై 55ను తాకాయి. వీటి విలువ రూ. 727 కోట్లుకాగా.. 2020లో 27 ఎస్‌ఎంఈలు ఐపీవోల ద్వారా కేవలం రూ. 159 కోట్లు సమీకరించాయి. ప్రైమ్‌డేటా బేస్‌ నివేదిక పొందుపరచిన వివరాలివి. ఇతర వివరాలు ఇలా.. 

పేటీఎమ్‌ జోరు 
ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్లో పేటీఎమ్‌ బ్రాండ్‌ కంపెనీ వన్‌97 కమ్యూనికేషన్స్‌ పెట్టుబడుల సమీకరణలో ఆధిపత్యం వహించింది. ఐపీవో ద్వారా రూ. 18,300 కోట్లు అందుకుంది. ఈ బాటలో ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో రూ. 9,300 కోట్లు సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో సగటు ఇష్యూ పరిమాణం రూ. 1,884 కోట్లకు చేరింది. 59 ఇష్యూలను విశ్లేషిస్తే 36 కంపెనీలకు 10 రెట్లుకుపైగా బిడ్స్‌ దాఖలయ్యాయి. వీటిలో ఆరు ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి 100 రెట్లు స్పందన లభించడం విశేషం! ఇక 8 ఇష్యూలు 3 రెట్లు, మరో 15 కంపెనీల ఆఫర్లకు 1–3 రెట్లు చొప్పున దరఖాస్తులు లభించాయి. 

ఈక్విటీ నిధుల హవా 
ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూలలో కొత్తతరం టెక్నాలజీ కంపెనీలు ఆధిపత్యం వహించినట్లు ప్రైమ్‌ డేటాబేస్‌ ఎండీ ప్రణవ్‌ హాల్దియా పేర్కొన్నారు. నష్టాలలో ఉన్నప్పటికీ పలు స్టార్టప్‌లు విజయవంతంగా నిధులను సమీకరించినట్లు తెలియజేశారు. ఇందుకు రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి భారీగా మద్దతు లభించినట్లు వివరించారు. దీంతో పలు కంపెనీలు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో భారీ లాభాలతో లిస్టయినట్లు ప్రస్తావించారు. మొత్తంమీద కంపెనీలు ఈక్విటీ(ఐపీవోలు,  ఆఫర్‌ ఫర్‌ సేల్‌) మార్గంలో 2020లో సమకూర్చుకున్న రూ. 1,76,914 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రూ. 2 లక్షల కోట్లకు మించిన పెట్టుబడులను అందుకున్నాయని వెల్లడించారు.  

నిధుల సమీకరణ రికార్డ్‌ 
ఈ ఏడాది దేశీయంగా కంపెనీలు సమీకరించిన నిధులు రూ. 2 లక్షల కోట్లను దాటేశాయ్‌. వీటిలో 51 శాతం అంటే రూ. 1,03,621 కోట్లు తాజా పెట్టుబడులుకాగా..మరో రూ. 98,388 కోట్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా సమకూర్చుకున్నాయి. వెరసి ఈ ఏడాది కార్పొరేట్లు రూ. 2,02,009 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు నివేదిక తెలియజేసింది. ప్రధానంగా ప్రైమరీ మార్కెట్‌ ద్వారా ఇప్పటివరకూ 63 కంపెనీలు రూ. 1,18,704 కోట్లు అందుకున్నాయి. గతేడాది అంటే 2020లో 15 ఐపీవోల ద్వారా కంపెనీలు కేవలం రూ. 26,613 కోట్లు సమీకరించాయి. వీటితో పోలిస్తే ఈ ఏడాది ప్రధాన పబ్లిక్‌ ఇష్యూల ద్వారా 4.5 రెట్లు అధికంగా పెట్టుబడులు ప్రవహించాయని ప్రైమ్‌డేటా బేస్‌ తెలియజేసింది. ఈ నివేదిక ప్రకారం 2017లో ప్రైమరీ మార్కెట్‌లో నమోదైన రూ. 68,827 కోట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోగా.. లక్ష కోట్లను దాటడం ద్వారా ప్రైమరీ మార్కెట్‌ సరికొత్త రికార్డుకు తెరతీసింది. కాగా.. గత వారం ఇష్యూలను సైతం చేరిస్తే 65 కంపెనీలు రూ. 1.35 లక్షల కోట్ల(15.3 బిలియన్‌ డాలర్లు)ను సమీకరించినట్లవుతుందని బ్రోకింగ్‌ సంస్థ కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ ముందురోజు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top