రంకెలేసిన బుల్, 18 లక్షల కోట్లను క్రాస్‌ చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విలువ!

Reliance Market Valuation Going Past Rs 18 Lakh Crore Mark - Sakshi

ముంబై: ఉక్రెయిన్‌ రష్యాల మధ్య చర్చల ద్వారా సయోధ్య కుదిరే అవకాశం ఉందన్న వార్తలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మూడోరోజూ ముందుకే కదిలింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో పాటు  మార్కెట్ల అనిశ్చితిని అంచనా వేసే వీఐఎక్స్‌ ఇండెక్స్‌ భారీగా దిగిరావడం (20 స్థాయికి దిగువకు)ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర అధిక వెయిటేజీ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు బుధవారం ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 740 పాయింట్ల లాభంతో 58,684 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు బలపడి 17,498 వద్ద నిలిచింది. ఈ ముగింపు సూచీలకు ఆరువారాల గరిష్టస్థాయి కావడం విశేషం.

విస్తృతస్థాయి మార్కెట్లో బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. మెటల్, ఫార్మా, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో ఒక్క జపాన్‌ స్టాక్‌ మార్కెట్‌ మాత్రమే నష్టపోయింది. మిగిలిన అన్ని దేశాల స్టాక్‌ సూచీలు రెండు శాతం వరకు రాణించాయి. ఇటీవల భారీ ర్యాలీ నేపథ్యంలో యూరప్‌ మార్కెట్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1357 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,126 కోట్ల షేర్లను కొన్నారు. 

మూడురోజుల్లో రూ.3 లక్షల కోట్లు 
గడిచిన మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 1321 పాయింట్లు పెరగడంతో బీఎస్‌ఈ నమోదిత కంపెనీలు మొత్తం రూ.3 లక్షల కోట్లను ఆర్జించాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ బుధవారం రూ.264 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఇదే మూడురోజుల్లో నిఫ్టీ సూచీ 345 పాయింట్లు లాభపడింది. ఒడిదుడుకులమయంగా సాగిన మార్చి ట్రేడింగ్‌లో మొత్తం రూ.11 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.  ‘‘ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ తేదీ(నేడు)న నిఫ్టీ 17,450 స్థాయి నిలుపుకోలిగే షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీ జరగవచ్చు. దీంతో రానున్న రోజుల్లో కీలక నిరోధం 17,900 స్థాయిని చేధించేందుకు వీలుంటుంది. ఇటీవల గరిష్టాలను చేరిన కమోడిటీ, క్రూడ్‌ ధరలు దిగిరావడంతో కార్పొరేట్లపై నెలకొన్న మార్జిన్ల ఒత్తిళ్లు తగ్గొచ్చనే అంచనాలు సూచీల ర్యాలీకి తోడ్పడ్డాయి’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలిపారు.   

రూపాయి 21 పైసలు పతనం: డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం 21 పైసలు క్షీణించి 75.94 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల రికవరీతో పాటు వడ్డీరేట్ల పెంపు భయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు రూపాయి కరిగేందుకు కారణమయ్యాయి. ఫారెక్స్‌ మార్కెట్లో ఉదయం 75.65 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 75.62 వద్ద గరిష్టాన్ని, 75.97 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది.  

రిలయన్స్‌ : రూ.18 లక్షల కోట్లు 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు బీఎస్‌ఈలో రెండుశాతం లాభపడి రూ.2,673 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.18 లక్షల కోట్లను అధిగమించింది.

మార్కెట్లో మరిన్ని సంగతులు... 

టాటా కాఫీ(టీసీఎల్‌)ని విలీనం చేసుకుంటామని టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ ప్రకటనతో టీసీఎల్‌ షేరు తొమ్మిది శాతం లాభపడి రూ.215 వద్ద స్థిరపడింది. ఒక దశలో 13 శాతం పెరిగి రూ.222 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.  

ఎస్‌అండ్‌పీ బ్రోకరేజ్‌ సంస్థ పాజిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించడంతో బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు మూడుశాతం లాభపడి రూ.7,254 వద్ద ముగిసింది.  

► ఓఎన్‌జీసీ ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ఇష్యూ మొదలుకావడంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో ఐదు శాతం క్షీణించి రూ.162 వద్ద స్థిరపడింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top