5జీ సేవలు: ప్రధాన ప్రత్యర్థులతో జియో కీలక డీల్స్‌

Reliance Jio partners Ericsson Nokia MultiYear 5G RAN Equipment Deal - Sakshi

సాక్షి,ముంబై: దేశంలో అత్యంత వేగవంతమైన 5జీ సేవల విషయంలో శరవేగంగా అడుగులు వేస్తున్న టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తాజాగా  నోకియాతో కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతోపాటు ఎరిక్‌సన్‌ కంపెనీతో కూడా మరో ముఖ్యమైన డీల్‌ కుదుర్చుకుంది. ఈ  కంపెనీల ద్వారా  5G RAN (రేడియో యాక్సెస్ నెట్‌వర్క్) పరికరాలను కొనుగోలు చేయనుంది. ఈ  మేరకు టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా సోమవారం  ఒకప్రకటన విడుదల చేసింది.

ఇందుకోసం ముఖ్యంగా నోకియాతో  మల్టీ-ఇయర్ డీల్‌ చేసుకుంది. నోకియా, జియో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు బహుళ-సంవత్సరాల ఒప్పందం కాబట్టి, భారతీయ మార్కెట్లో  నోకియాకు  ఇది భారీ విజయమని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే తద్వారా సాధారణ వినియోగదారులకు కూడా 5జీ స్టాండ్‌లోన్‌ నెట్‌వర్క్‌ను అందించే దేశీయ తొలి టెల్కోగా జియో అవతరించనుంది. 

నోకియా డీల్‌పై రిలయన్స్‌ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. నోకియాతో తమ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతన 5జీ నెట్‌వర్క్‌ని అందించే సంస్థగా తాము నిలవనున్నట్టు చెప్పారు. నోకియా ప్రెసిడెంట్, సీఈవో పెక్కా లండ్‌మార్క్ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో లక్షలాది మంది  ప్రీమియం 5 జీ సేవలు  ఆస్వాదించనున్నారని తెలిపారు.

ఎరిక్సన్‌తో డీల్‌
దేశీయంగా 5జీ స్టాండ్‌లోన్‌ నెట్‌వర్క్‌ నిమిత్తం నోకియా ప్రధాన పోటీదారు ఎరిక్సన్‌తో కూడా జియో ఒప్పందం కుదుర్చుకుంది. జియో-ఎరిక్సన్ మధ్య కుదిరిన ఈ తొలి డీల్‌ దేశంలో రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌నుమరింత విస్తరించనున్నట్టు కంపెనీ తెలిపింది.  జియో 5జీ సేవలు, ‘డిజిటల్ ఇండియా' విజన్‌ సాధనలో ఈడీల్‌ ఒక పునాదిగా ఉపయోగపడుతుందని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ  విశ్వాసాన్ని ప్రకటించారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top