
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా బ్రిటన్‌కు చెందిన దిగ్గజ కంట్రీ క్లబ్, లగ్జరీ గోల్ఫ్ రిసార్ట్ స్టోక్ పార్క్‌ను దక్కించుకుంది. ఈ డీల్ విలువ 57 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 592 కోట్లు). పలు జేమ్స్ బాండ్ సినిమాల్లో స్టోక్ పార్క్ దర్శనమిస్తుంది. బ్రిటన్‌కు చెందిన స్టోక్ పార్క్ లిమిటెడ్‌ను తమ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ (ఆర్‌ఐఐహెచ్‌ఎల్) కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఆతిథ్య రంగంలో కార్యకలాపాల విస్తరణకు రిలయన్స్‌కి ఈ డీల్ ఉపయోగపడనుంది. రిలయన్స్‌కి ఇప్పటికే ఈఐహెచ్ లిమిటెడ్ (ఒబెరాయ్ హోటల్స్)లో గణనీయంగా వాటాలు ఉన్నాయి.
జేమ్స్‌బాండ్ సినిమాలకు కేరాఫ్..
బ్రిటన్ సినీ పరిశ్రమతో స్టోక్ పార్క్‌కు చాన్నాళ్ల అనుబంధం ఉంది. రెండు జేమ్స్‌బాండ్ సినిమాల్లో ఇది కనిపిస్తుంది. గోల్డ్‌ఫింగర్ (1964), టుమారో నెవర్ డైస్ (1997) సినిమాలను స్టోక్ పార్క్‌లో తీశారు. 300 ఎకరాల సువిశాల పార్క్‌లాండ్‌లో 49 లగ్జరీ బెడ్‌రూమ్‌లు, సూట్‌లు, 27 హోల్ గోల్ఫ్ కోర్స్, 13 టెన్నిస్ కోర్టులు, 14 ఎకరాల ప్రైవేట్ గార్డెన్లను స్టోక్ పార్క్ నిర్వహిస్తోంది. స్టోక్ పార్క్ ఎస్టేట్‌కి దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉండగా 1908 దాకా ప్రైవేట్ ప్రాపర్టీగానే కొనసాగింది.