జీతాలపై ప్రభావం.. ఎయిర్‌ఇండియా ఉద్యోగుల ఆందోళన! | Sakshi
Sakshi News home page

జీతాలపై ప్రభావం.. ఎయిర్‌ఇండియా ఉద్యోగుల ఆందోళన!

Published Wed, May 22 2024 6:52 PM

reduced flights impacting cabin crew salaries AI Express union

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది సమ్మెను విరమించిన రెండు వారాలలోపే మరో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. విమానాల ఆలస్యం, రద్దు కారణంగా డిపార్చర్ల సంఖ్య తగ్గడం క్యాబిన్ సిబ్బంది జీతాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యూనియన్ పేర్కొంది.

ఎయిర్‌పోర్ట్ ప్రవేశ పాస్‌లు లేకపోవడంతో 100 మందికి పైగా క్యాబిన్ సిబ్బంది గత రెండు నెలలుగా ఫ్లైయింగ్‌ డ్యూటీలు లేకుండా ఖాళీగా కూర్చున్నట్లు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (AIXEU) పేర్కొంది. ఈ యూనియన్ ఎయిర్‌లైన్ క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో మే 9న చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) ఏర్పాటు చేసిన యూనియన్, విమానయాన సంస్థ ప్రతినిధుల సమావేశం తర్వాత క్యాబిన్ క్రూ సమ్మె విరమించింది. ఎయిన్‌లైన్‌ ​యాజమాన్య వైఖరికి నిరసనగా చేపట్టిన ఈ సమ్మె కారణంగా విమాన సర్వీసులకు అంతరాయాలు ఏర్పడ్డాయి.

ఎయిర్‌లైన్‌ షెడ్యూలింగ్ విభాగం కొత్త సాఫ్ట్‌వేర్‌కు మారుతున్న క్రమంలో క్యాబిన్ సిబ్బంది డేటా తొలగిపోయిందని తాజాగా చీఫ్ లేబర్ కమిషనర్‌కు రాసిన లేఖలో యూనియన్ పేర్కొంది. విమానాల రద్దు, ఆలస్యాలను కవర్ చేయడానికి క్యాబిన్ సిబ్బంది బేస్ వారీగా షెడ్యూలింగ్ విభాగానికి మాన్యువల్‌గా సహాయం చేస్తున్నారని యూనియన్ చెబుతోంది.

డిపార్చర్ల సంఖ్య తగ్గడం వల్ల క్యాబిన్ సిబ్బంది జీతాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని, ఈ విషయంలో కమిషనర్ తక్షణ జోక్యాన్ని యూనియన్ కోరుతోంది. క్యాబిన్ సిబ్బంది ఫ్లైయింగ్‌ హవర్స్‌తో జీతాలు కూడా ముడిపడి ఉంటాయి. అయితే ఈ అంశంపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక ప్రతినిధి నుంచి ఎటువంటి స్పందనా లేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement