
అక్టోబర్ 4 నుంచి కొత్త విధానం
ముంబై: చెక్కులను వేగంగా క్లియర్ (చెల్లింపులు) చేసే దిశగా ఆర్‌బీఐ అక్టోబర్ 4 నుంచి కొత్త యంత్రాంగాన్ని అమల్లోకి తీసుకురానుంది. బ్యాంక్‌లో చెక్కు సమర్పించిన గంటల్లోనే అది నగదుగా మారిపోనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చెక్కు ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) కింద రెండు పనిదినాల వరకు సమయం తీసుకుంటోంది. కొత్త విధానంలో చెక్కులను స్కాన్ చేసి వాటిని వెంటనే క్లియరింగ్ హౌస్‌కు బ్యాంక్‌లు పంపాల్సి ఉంటుంది. దీంతో క్లియరింగ్ సైకిల్ టీప్లస్1 (సమర్పించిన తర్వాతి రోజు) నుంచి కొన్ని గంటలకు తగ్గిపోనుంది.
సీటీఎస్‌లో బ్యాచ్ ప్రాసెసింగ్ నుంచి కంటిన్యూయెస్ క్లియరింగ్ విత్ ‘ఆన్ రియలైజేషన్ సెటిల్‌మెంట్’కు బ్యాంక్‌లు మారిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంక్‌లకు ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ చేసింది. ‘‘సీటీఎస్ నుంచి కంటిన్యూయెస్ క్లియరింగ్ అండ్ సెటిల్‌మెంట్ ఆన్ రియలైజేషన్‌కు రెండు దశల్లో మారిపోవాలని నిర్ణయించడమైంది. మొదటి దశ అక్టోబర్ 4 నుంచి, రెండో దశ 2026 జనవరి 3 నుంచి అమల్లోకి వస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకటే సెషన్ (చెక్కుల సమర్పణ) ఉంటుంది’ అని ఆర్‌బీఐ పేర్కొంది.