రైల్వే ప్రయాణికులకు షాక్.. భారీగా బాదుడు! | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రయాణికులకు షాక్.. భారీగా బాదుడు!

Published Sun, Jan 9 2022 5:51 PM

Railways To Levy Fee For Boarding, Alighting At Redeveloped Stations - Sakshi

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు భారీగా షాక్ ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్దం అవుతుంది. ఇక నుంచి కొన్ని రైల్వే స్టేషన్‌లలో ఎక్కిన, దిగిన మోత తప్పదు. పునర్అభివృద్ధి చెందిన స్టేషన్‌లలో ఎక్కువ దూరం ప్రయాణించే రైల్వే ప్రయాణికుల మీద ప్రయాణ తరగతిని బట్టి  ₹10 నుండి ₹50 వరకు స్టేషన్ అభివృద్ధి రుసుము విధించాలని రైల్వే శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. పునర్అభివృద్ధి చెందిన స్టేషన్లలో ఎక్కిన, దిగిన ఈ స్టేషన్ అభివృద్ధి రుసుమును వసూలు చేయనున్నారు. బుకింగ్ సమయంలోనే రైలు టిక్కెట్లకు రూపంలో ఈ మొత్తాన్ని వసూలు చేయలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

పునర్అభివృద్ధి చేసిన స్టేషన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఫీజు విధించనున్నారు. ఈ యూజర్ ఫీజు మూడు కేటగిరీల్లో ఉంటుంది. అన్ని ఏసీ క్లాసులకు ₹50, స్లీపర్ క్లాసులకు ₹25, అన్ రిజర్వ్డ్ క్లాసులకు ₹10 వసూలు చేయనున్నరు. రైల్వే బోర్డు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సబర్బన్ రైలు ప్రయాణాలకు ఈ స్టేషన్ అభివృద్ధి రుసుము వసూలు చేయరు. ఈ స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ల ధరలు కూడా ₹10 పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 

"స్టేషన్ డెవలప్ మెంట్ ఫీజు(ఎస్‌డిఎఫ్‌) ప్రయాణీకుల నుంచి సేకరించనున్నారు. అభివృద్ధి చెందిన/పునర్అభివృద్ధి చెందిన స్టేషన్లలో క్లాస్ వారీగా ఎస్‌డిఎఫ్‌ కింద ఛార్జ్ చేస్తారు. ఈ స్టేషన్లలో ప్రయాణీకులు దిగినట్లయితే  ఎస్‌డిఎఫ్‌ సూచించిన రేట్లలో 50 శాతం రుసుము ఫీజు ఉంటుంది. ఒకవేళ ఎక్కి, దిగే స్టేషన్స్ రెండు పునర్అభివృద్ధి చెందిన స్టేషన్స్ అయితే ఎస్‌డిఎఫ్‌ వర్తించే రేటుకు రుసుము 1.5 రెట్లు" అని సర్క్యులర్ లో పేర్కొంది. ఎస్‌డిఎఫ్‌ రుసుము విధించడం వల్ల రైల్వేలకు ఆదాయం పెరుగుతుంది. ఈ చర్య ప్రైవేట్ కంపెనీలను ఆకర్షించడానికి సహాయపడుతుంది అని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పశ్చిమ మధ్య రైల్వేకు చెందిన రాణి కమలాపతి స్టేషన్, పశ్చిమ రైల్వేలోని గాంధీనగర్ క్యాపిటల్ స్టేషన్‌లను అభివృద్ధి చేసి ప్రారంభించారు.

(చదవండి: Jan Dhan Yojana: జన్ ధన్ యోజన ఖాతాలో భారీగా నగదు జమ..!)

Advertisement
Advertisement