ఫలితాలు, ఆర్థిక గణాంకాలే దిక్సూచి

Q3 earnings from IT majors, macro data to drive markets this week - Sakshi

వెల్లడికానున్న ఐటీ దిగ్గజాల క్యూ3 పనితీరు

ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలు సైతం కీలకం

ఈ వారం మార్కెట్ల ట్రెండ్‌పై నిపుణుల అంచనాలు

న్యూఢిల్లీ: ఈ వారం ప్రధానంగా ఐటీ దిగ్గజాల క్యూ3(అక్టోబర్‌– డిసెంబర్‌) ఫలితాలు ఈక్విటీ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటితోపాటు ఆర్థిక గణాంకాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసిక(క్యూ3) ఫలితాల సీజన్‌ ఈ నెల 9నుంచి ప్రారంభంకానుంది. గత వారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అత్యధిక శాతం నికర అమ్మకందారులుగా నిలిచిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనకడుగు వేశాయి. దీంతో విదేశీ పెట్టుడి పరిస్థితులు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు తెలియజేశారు.  

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సైతం
నేడు(సోమవారం) సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ఈ ఏడాది క్యూ3 ఫలితాలు విడుదల చేయనుంది. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 12న, విప్రో 13న క్యూ3 పనితీరును ప్రకటించనున్నాయి. ఇక బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ 14న ఆర్థిక ఫలితాలు వెల్లడించనుంది. ఇక మరోవైపు ప్రభుత్వం 12న నవంబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదల చేయనుంది. ఇదే రోజు డిసెంబర్‌ నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) వివరాలు సైతం ప్రకటించనుంది. వెరసి ఈ వారం పలు అంశాలు దేశీ స్టాక్‌ మార్కెట్ల నడకను ప్రభావితం చేయనున్నట్లు పలువురు నిపుణులు తెలియజేశారు.  

ఇతర అంశాలకూ ప్రాధాన్యం
ఈ వారం యూఎస్, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం ఈ నెల 12నే విడుదలకానున్నాయి. రష్యా– ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇవికాకుండా ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. గత వారం విడుదలైన మినిట్స్‌ ప్రకారం యూఎస్‌ ఫెడ్‌ 2023లోనూ వడ్డీ రేట్ల పెంపువైపు మొగ్గు చూపనున్నట్లు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కొంతమేర బలహీనపడ్డాయి. దేశీయంగా సెన్సెక్స్‌ 940 పాయింట్లు(1.55 శాతం), నిఫ్టీ 246 పాయింట్లు(1.4 శాతం) చొప్పున క్షీణించాయి. ఇక డాలరుతో మారకంలో రూపాయి సైతం 82–83 మధ్య కదులుతోంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు పలు అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఎఫ్‌పీఐల వెనకడుగు
గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అత్యధిక శాతం అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో కొత్త కేలండర్‌ ఏడాది(2023) తొలి వారంలో నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ నెల 2–6 మధ్య ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 5,872 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పలు దేశాలలో మరోసారి కోవిడ్‌–19 సమస్య తలెత్తడం, ఫెడ్‌ వడ్డీ పెంపు, రష్యా– ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ భయాలు వంటి అంశాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. యూఎస్‌లో ఈ ఏడాది ఆర్థిక మాంద్యం ఏర్పడనున్న అంచనాలు సైతం ఆందోళనలు పెంచుతున్నట్లు తెలియజేశారు. ఇకపై క్యూ3 ఫలితాలు, ద్రవ్యోల్బణం, జీడీపీ గణాంకాలు వంటి అంశాలు విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు వివరించారు.

డిపాజిటరీల గణాంకాల ప్రకారం నిజానికి గత 11 ట్రేడింగ్‌ సెషన్లలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 14,300 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. అయితే డిసెంబర్‌ నెలలో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. నవంబర్‌లో రూ. 36,239 కోట్ల విలువైన స్టాక్స్‌ జత చేసుకోవడం గమనార్హం! పూర్తి ఏడాది(2022)లో మాత్రం దేశీ ఈక్విటీల నుంచి నికరంగా రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు మూడేళ్లుగా ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చిన ఎఫ్‌పీఐలు పలు ప్రపంచవ్యాప్త ప్రతికూలతల నడుమ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు స్టాక్‌ నిపుణులు తెలియజేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top