
అనిశ్చితి నుంచి రక్షణ కల్పించే సంప్రదాయ సాధనంగా నిలుస్తున్న జీవిత బీమా కొన్నాళ్లుగా గణనీయ మార్పులకు లోనైంది. ఒకప్పుడు రియాక్టివ్ రక్షణ కవచంగా వ్యవహరించేది కాస్తా ఇప్పుడు ఆర్థిక సాధికారత కల్పించే క్రియాశీల ప్రోయాక్టివ్ సాధనంగా మారింది. మారుతున్న జీవన విధానాలు, డిజిటల్ వినియోగానికి అనుగుణంగా బీమా పరిశ్రమ తనను తాను మల్చుకునే కొద్దీ, జీవిత బీమా అసలు అవసరమా అనే ప్రశ్న కన్నా వినియోగదారులకు సంస్థలు ఆఫర్ చేసే పథకాలు నిజంగా వారి అవసరాలకు తగ్గట్టుగానే ఉన్నాయా లేదా అనేది ప్రధాన ప్రశ్నగా ఉంటోంది.
ప్రతి దశలో ఆర్థిక భాగస్వామి..
డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా అనలిటిక్స్ మొదలైన అంశాల దన్నుతో బీమా పథకాలు మరింత సరళతరంగా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మారాయి. సంపద సృష్టి, ఆదాయార్జన, కుటుంబానికి ఆర్థిక సంరక్షణ తదితర లక్ష్యాల సాధనకు తోడ్పడేవిగా ఉంటున్నాయి. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకోవడంలో కెరియర్ ప్రారంభిస్తున్న యువ ప్రొఫెషనల్స్‌కి, పిల్లల చదువులు కోసం పొదుపు చేయడంలో కుటుంబాలకు, స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే రిటైరీల నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాల సాధనకు ఉపయోగపడేదిగా జీవిత బీమా ఉంటోంది. 2024 సెప్టెంబర్ నాటికి దేశీయంగా మొత్తం సమ్ అష్యూర్డ్ వార్షిక ప్రాతిపదికన 15% పెరిగి రూ. 36.37 లక్షల కోట్లకు చేరడమనేది ఈ ట్రెండ్‌నే సూచిస్తోంది. జీవిత బీమాపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం.
ఖరీదైనదనే అపోహ..
జీవిత బీమా పాలసీలతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, చాలా మంది వీటిని తీసుకోవడం లేదు. ఇవి చాలా ఖరీదైనవనే అపోహే ఇందుకు కారణం. సాధారణంగా వీలైనంత తక్కువ వయస్సులోనే తీసుకుంటే పాలసీలు చాలా తక్కువ ప్రీమియంలతో, అత్యధిక కవరేజీని పొందవచ్చు. కానీ ఖరీదైనవనే అపోహల వల్ల యువత కూడా సాధ్యమైనంత ముందుగా బీమాను తీసుకోవడం తక్కువగా ఉంటోంది. ఐఆర్‌డీఏఐ నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జీవిత బీమా కవరేజీ అనేది స్థూల దేశీయోత్పత్తిలో 2.8 శాతంగానే ఉంది.
అంతర్జాతీయ సగటు అయిన 7 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, బీమాను విస్తరించేందుకు (ముఖ్యంగా యువతలో, అంతగా సేవలు అందని వర్గాల్లో) గణనీయంగా అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జీవిత బీమా అనేది ఎంత అఫోర్డబుల్‌గా, ఎంత ఉపయోగకరంగా ఉంటుందనే విషయాలపై అవగాహన పెంపొందించడంపై, అలాగే తమ ఆర్థిక భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడంలో ప్రజలకు తోడ్పాటు అందించడంపై బీమా పరిశ్రమ మరింతగా దృష్టి సారించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం జీవిత బీమా అంటే రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రజలు తమ ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేసుకునేందుకు, సాధించుకునేందుకు కూడా సహాయపడుతోంది. ఉదాహరణకు యులిప్‌లు (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు) ఒకవైపు కవరేజీ అందిస్తూనే మరోవైపు ఫైనాన్షియల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా ఉపయోగపడతాయి. మీ వయస్సు, అవసరాలు, రిస్కు సామర్థ్యాలను బట్టి ఇన్వెస్ట్‌మెంట్ స్టయిల్‌ను మార్చుకునేలా ఇవి సరళతరంగా కూడా ఉంటాయి. మరోవైపు, ఎండోమెంట్ లేదా గ్యారంటీడ్ రిటర్న్ పాలసీలు, స్థిరంగా నిర్దిష్ట రాబడులు అంది స్తాయి. భద్రత, అంచనా వేయతగిన విధంగా రాబడులు ఉండాలని కోరుకునే వారికి ఇవి అనువైనవిగా ఉంటాయి. ఇలాంటి ప్లాన్లన్నీ, పిల్లల చదువులు లేదా రిటైర్మెంట్ నిధి రూపొందించుకోవడం లాంటి దీర్ఘకాల అవసరాలకు ఉపయోగపడతాయి.
రిటైర్మెంట్ వేళ.. భద్రత..
జీవన ప్రమాణాలు, ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటమనేది చాలా కష్టంగా మారుతోంది. యాన్యుటీ ప్లాన్ల ద్వారా జీవిత బీమా ఇలాంటి సమస్యను అధిగమించడంలో తోడ్పాటు అందిస్తుంది. ఈ ప్లాన్లు మీ అవసరాలను బట్టి తక్షణం కావచ్చు లేదా భవిష్యత్‌లో కావచ్చు మీ పొదుపు మొత్తాన్ని క్రమానుగత ఆదాయంగా అందిస్తాయి. వయస్సు మీద పడిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇవి సహాయపడతాయి. అలాగే, పదవీ విరమణ పొందినవారు ఆత్మగౌరవం, ఆర్థిక స్వాతంత్య్రంతో జీవించేందుకు ఉపయోగపడతాయి.
సరళమైన, పర్సనలైజ్డ్ కవరేజీ..
జీవిత బీమా మరింత పర్సనలైజ్డ్ సాధనంగా మారుతోంది. డిటల్ సాధనాలు, కస్టమర్ డేటాను ఉపయోగించి బీమా కంపెనీలు నేడు పాలసీదారుల విశిష్టమైన లైఫ్‌స్టయిల్, జీవిత దశలకు అనుగుణమైన పథకాలను అందిస్తున్నాయి. క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజీ, ప్రీమియం చెల్లింపుల్లో అంతరాయాల నుంచి రక్షణ, అదనపు ప్రయోజనాలు కల్పించే ఫీచర్ల కారణంగా జీవిత బీమా పాలసీలు మరింత సరళంగా, అధునాతనంగా మారాయి. జీవన విధానాల్లో మార్పులు, నిధుల సంక్షోభాలు, వ్యక్తిగతంగా కొత్త లక్ష్యాల సాధన వంటి సందర్భాల్లో బీమా పాలసీలు దన్నుగా ఉంటాయి.
ఆర్థిక భద్రత
దీర్ఘకాలంలో ఎలాంటి సవాలునైనా ధీమాగా ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి అఫర్డబుల్, వినూత్నమైన జీవిత బీమా అవసరం ఎంతో ఉంది. చౌకగా, సరళతరంగా, రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉండేలా బీమా సంస్థలు తమ పాలసీలను సరళతరం చేస్తున్నాయి. ఆధునీకరిస్తున్నాయి. నేటి ఒడిదుడుకుల ప్రపంచంలో జీవిత బీమాను ఒక రక్షణాత్మక కవచంగానే కాకుండా భవిష్యత్తుకు భద్రత కల్పించే పురోగామి ఆర్థిక సాధనంగా చూడాలి. బీమాను స్మార్ట్, వ్యూహాత్మక ఆర్థిక సాధనంగా పరిశ్రమ కూడా ప్రమోట్ చేయాలి.