పెట్రోల్‌, డీజిల్‌ ధరల సెగ- రెండేళ్ల గరిష్టం

Petrol- Diesel prices @ two year high - Sakshi

లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 30 పైసల వడ్డింపు

ఢిల్లీలో పెట్రోల్‌ రూ. 83.71కు, డీజిల్‌ రూ. 73.87కు

రెండేళ్ల గరిష్టానికి చేరిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

గత 17 రోజుల్లో పెట్రోల్‌పై రూ. 2.65 పెంపు

ఈ బాటలో లీటర్‌ డీజిల్‌పైనా రూ. 3.40 వడ్డింపు

విదేశీ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరల ఎఫెక్ట్‌

న్యూఢిల్లీ, సాక్షి: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. సగటున పెట్రోల్‌పై 30-33 పైసలు, డీజిల్‌ లీటర్‌పై రూ. 25-31 పైసల చొప్పున ఎగశాయి. తాజాగా ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 30 పైసలు బలపడి రూ. 83.71కు చేరింది. డీజిల్‌ ధర సైతం లీటర్‌కు 25 పైసలు అధికమై రూ. 73.87ను తాకింది. వెరసి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. కాగా..  ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. 48 రోజుల తదుపరి మళ్లీ నవంబర్‌ 20న దేశీయంగా పెట్రోల్‌ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అప్పటినుంచీ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతుండటంతో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంటపుట్టిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. 

17 రోజుల్లో
గత 17 రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ రూ. 2.65 పెరిగినట్లు ఇంధన రంగ విశ్లేషకులు తెలియజేశారు. ఇదేవిధంగా డీజిల్‌ లీటర్‌పై మరింత అధికంగా రూ. 3.40 పెంపు అమలైనట్లు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం ముంబైలో పెట్రోల్‌ 33 పైసలు బలపడి రూ. 90.34కు చేరింది. కోల్‌కతాలోనూ రూ. 84.86 నుంచి రూ. 85.19కు చేరింది. ఇక చెన్నైలో పెట్రోల్‌ లీటర్‌ రూ. 20 పైసలు పెరిగి రూ. 86.51 అయ్యింది. 

డీజిల్‌ ధరలు ఇలా
ఢిల్లీలో డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ. 25 పైసలు పెరిగి 73.87కు, ముబైలో 31 పైసలు బలపడి 80.51కు, కోల్‌కతాలో 29 పైసలు అధికమై 77.44కు చేరాయి. చెన్నైలోనూ డీజిల్‌ లీటర్‌ 28 పైసలు పెరిగి 79.21ను తాకింది.

కోతల ఎఫెక్ట్‌
రష్యాసహా ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిలో కోతలను 2021 జనవరి తదుపరి సైతం కొనసాగించేందుకు అంగీకరించడంతో ముడిచమురు ధరలు ర్యాలీ బాటలో సాగుతున్నాయియి.వారాంతాన దాదాపు 10 నెలల గరిష్టాలకు చేరాయి. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ 0.5 శాతం నీరసించి 49 డాలర్లను తాకింది. న్యూయార్క్‌ మార్కెట్లోనూ నైమెక్స్‌ చమురు 0.54 శాతం క్షీణించి 46.01 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒపెక్‌ తదితర దేశాలు ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్‌ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా ఒప్పందంలో భాగంగా రోజుకి 7 మిలియన్‌ బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. 

దేశీయంగా
విదేశీ ప్రభావంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్‌ క్రూడ్‌ బాస్కెట్‌ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top