పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు రెక్కలు

Petrol, diesel price hike 11th time from November 20th - Sakshi

లీటర్‌ పెట్రోల్‌ 17 పైసలు అప్‌

19 పైసలు ఎగసిన డీజిల్‌ లీటర్‌ ధర

నవంబర్ 20 నుంచీ 11 సార్లు ధరల పెంపు

బుధవారం దాదాపు 2 శాతం ఎగసిన చమురు ధరలు

న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల నిలకడ తదుపరి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 17 పైసలు బలపడి రూ. 82.66కు చేరింది. డీజిల్‌ ధర సైతం లీటర్‌కు 19 పైసలు అధికమై రూ. 72.84ను తాకింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నాయి. కాగా.. 48 రోజుల తదుపరి ఈ నెల 20న దేశీయంగా పెట్రోల్‌ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. తదుపరి తాజా పెంపుతో కలిపి ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ 11సార్లు ధరలను పెంచడం గమనార్హం! దీంతో 11 రోజుల్లో పెట్రోల్‌ ధర లీటర్‌కు సగటున సుమారు రూ. 1.20 వరకూ పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక డీజిల్‌ ధర అయితే మరింత అధికంగా లీటర్‌ రూ. 1.80 వరకూ ఎగసినట్లు తెలియజేశారు. 

చమురు జోరు
ఫైజర్‌ వ్యాక్సిన్‌కు యూకే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో విదేశీ మార్కెట్లో బుధవారం ముడి చమురు ధరలు దాదాపు 2 శాతం ఎగసాయి. ఈ బాటలో తాజాగా మరోసారి నామమాత్రంగా బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు బ్యారల్‌ 45.30 డాలర్లకు చేరగా.. లండన్‌ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 48.30 డాలర్లను తాకింది. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్‌ క్రూడ్‌ బాస్కెట్‌ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top