పేటీఎంపై సంచలన ఆరోపణలు..! అందుకే బ్యాన్‌ విధించిన ఆర్బీఐ..! క్లారిటీ ఇచ్చిన పేటీఎం

Paytm Payments Bank Denies Reports of Data Leak to China Firms - Sakshi

కొత్త ఖాతాలను తెరవడం నిలిపివేయాల్సిందిగా పేటీఎం పేమెంట్‌ బ్యాంకును రిజర్వ్‌ ఆఫ్‌ బ్యాంకు ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు సంబంధించిన వివరాలను చైనా కంపెనీలకు లీక్‌ చేశారని ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్‌ ఒక నివేదికలో సంచలన ఆరోపణలను చేసింది. 

చైనా కంపెనీల చేతిలోకి..!
కొద్ది రోజుల క్రితం పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుకు ఆర్బీఐ గట్టిషాక్‌ను ఇచ్చింది. బ్యాంక్‌లో కొన్ని పర్యవేక్షణ లోపాలను గుర్తించడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు విదేశాల్లోని సర్వర్‌లకు డేటాను అనుమతించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు బ్లూమ్‌బెర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. చైనా ఆధారిత సంస్థలతో కంపెనీ సర్వర్లు సమాచారం పంచుకుంటున్నాయని ఆర్బీఐ వార్షిక తనిఖీల్లో గుర్తించాయని నివేదికలో వెల్లడించింది.అందుకే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై నిషేధం విధించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ అభిప్రాయపడింది. ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో పలు చైనా కంపెనీలు పరోక్షంగా వాటాను కలిగి ఉన్నాయి. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ, జాక్ మాస్ యాంట్ గ్రూప్ కో పేటీఎంలో వాటాలను కల్గి ఉన్నాయి. 

తప్పుడు వార్తలు..!
బ్లూమ్‌బెర్గ్‌ నివేదికను పేటీఎం తీవ్రంగా ఖండించింది.అవన్నీ పూర్తిగా తప్పుడు ఆరోపణలంటూ పేర్కొంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు సంబంధించిన డేటాను ఎవరితో పంచుకోలేదని వెల్లడించింది. డేటా స్థానికీకరణపై ఆర్బీఐ ఆదేశాలను పేటీఎం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది. బ్యాంకుకు సంబంధించిన డేటా మొత్తం భారత్‌లోనే ఉందని తెలిపింది. పూర్తి స్వదేశీ బ్యాంకుగా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ఉన్నందుకు గర్విస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇక ఆర్బీఐ ప్రకటనతో పేటీఎం షేర్లు సోమవారం రోజున 13.3 శాతం మేర పడిపోయాయి. 

చదవండి: బెస్ట్‌ సెల్లింగ్‌ కార్‌.. 5 లక్షల కంటే తక్కువ ధరలోనే రెనాల్ట్‌ క్విడ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top