
రతన్ టాటా మరణించి ఏడాది కావొస్తున్నా.. తాను చేసిన మంచి పనులు ఇప్పటికీ ఆయనను గుర్తుచేసుకునేలా చేస్తున్నాయి. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, విపత్తు సహాయ కార్యక్రమాలు వంటి విభాగాల్లో సేవలు అందించి.. ఎంతోమందికి ఉపయోగపడిన రతన్ టాటా.. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా కృషి చేశారు.
రతన్ టాటా దిగ్గజ పారిశ్రామిక వేత్తగా ఎదుగుతూనే.. భారతదేశ ఆర్థిక స్థిరత, ఉపాధి, విదేశీ పెట్టుబడులు, టెక్నాలజీ అభివృద్ధి మొదలైన రంగాల్లో తనదైన ముద్ర వేశారు. టాటా సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో ఈయన పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి. ఎన్నో జాతీయ.. అంతర్జాతీయ రంగాల్లో పెట్టుబడులు పెట్టి.. కొత్త స్టార్టప్‌లను ప్రోత్సహించారు. ఇందులో భాగంగానే గ్లోబల్ కంపెనీలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, కన్స్యూమర్ ప్రాడక్ట్స్ మొదలైన విభాగాల్లో ఇన్వెస్ట్ చేశారు.

ముఖ్యంగా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా రతన్ టాటా.. ఓలా క్యాబ్స్, పేటీఎం, స్నాప్‌డీల్, అర్బన్ ల్యాడర్, అప్‌స్టాక్స్, ఫస్ట్‌క్రై మొదలైన స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. దీని ద్వారా దేశంలో పరిశ్రమలు పెరగడమే కాకుండా.. ఉద్యోగావకాశాలు కూడా మెండుగా లభిస్తాయని భావించారు.
రతన్ టాటా గురించి
రతన్ టాటా 1937 డిసెంబర్ 28న దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో.. నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఐబీఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్‌డీ టాటా రతన్ టాటాను ఇండియాకు వచ్చి టాటా స్టీల్‌లో చేరమని సలహా ఇచ్చారు. దాంతో అమెరికా నుంచి ఇండియాకు వచ్చి జంషెడ్‌పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.
1991లో జేఆర్‌డీ టాటా.. రతన్ టాటాను టాటా గ్రూప్ ఛైర్మన్‌గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డ్ అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎటువంటి అనుభవంలేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్లందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. రూ.10 వేలకోట్లుగా ఉండే వ్యాపారాన్ని దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేర్చారు.

ఇంత పెద్ద కంపెనీకి సారథ్యం వహిస్తున్నప్పటికీ రతన్ టాటా ప్రపంచంలో, భారతదేశంలోని ధనవంతుల జాబితాలో ఏనాడూ స్థానం సంపాదించలేదు. ఎందుకంటే టాటా కంపెనీకి వచ్చే లాభాల్లో దాదాపు 66% శాతం టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థలకే విరాళం ఇస్తున్నారు. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవ సంస్థలకు కాకుండా రతన్ టాటాకు చెందితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండేవారు.
రతన్ టాటా ఎదుర్కొన్న అవరోధాలు
రతన్‌టాటా తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు..1998లో రతన్ టాటా, టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదట సంవత్సరం ఆశించినమేర విక్రయాలు జరగలేదు. దాంతో అందరూ టాటా ఇండికా విభాగాన్ని అమ్మేయాలని సలహా ఇచ్చారు. దాంతో ఫోర్డ్ కంపెనీని ఆశ్రయించారు. కార్ల తయారు చేయడం తెలియనప్పుడు ఎందుకు సాహసం చేయడమని అవమానించారు. ఆ తరువాత క్రమంగా ఇండికాను లాభాలబాట పట్టించారు.
ఇదీ చదవండి: 2026లో జీతాలు పెరిగేది వీరికే!.. రిపోర్ట్ వచ్చేసింది
యూరప్‌కు చెందిన కోరస్ స్టీల్ కంపెనీను కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్‌కు చెందిన టెట్లీ టీ కంపెనీను కొని ‘టాటా టీ’లో విలీనం చేశారు. దాంతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టీ కంపెనీగా టాటా ఎదిగింది. ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్‌లో కలుపుకుని టాటాను ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చారు రతన్ టాటా. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్లైతే భారతీయులను పరిపాలించారో.. అదే బ్రిటిష్ వారికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.