పాత ఫోన్లు, లాప్‌ట్యాప్‌లను అమ్మేందుకు ఇది మంచి అడ్డా

Cashify Is One Of The Best Way To Sell Old Electronics - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: వేల రూపాయలు పెట్టి కొన్న గాడ్జెట్లు నెలలు తిరగకుండానే ఓల్డ్‌ మోడల్‌ అవుతున్నాయి.  ఇయర్‌ ఫోన్స్‌ మొదలు స్మార్ట్‌ఫోన్ల వరకు , కీబోర్డు మొదలు టచ్‌ ల్యాప్‌టాప్‌ల వరకు వెంట వెంటనే అప్‌డేట్‌ వెర్షన్‌లు వచ్చేస్తున్నాయి. కొత్త వెర్షన్‌ వస్తువు కొందామంటే.. పాతది ఏం చేయాలని? ఎలా రీజనబుల్‌ ధరకు అమ్మేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ  సమస్యను తీరుస్తూ..  పాత ఎలక్ట్రానిక్‌ వస్తువుల కొనడమే పనిగా ఈ-కామర్స్‌లోకి అడుగుపెట్టింది క్యాషిఫై. 

పాతవి అమ్మాలంటే
మార్కెట్‌లో ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ విషయంలో వెనువెంటనే మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్ల విషయంలో ఇది మరీ ఎక్కువ. వారం తిరక్కుండానే కొత్త ఫీచర్లతో తక్కువ ధరలో మంచి ఫోన్లు వస్తున్నాయి. దీంతో కొత్త ఫోన్లు చాలా త్వరగా ఓల్డ్‌ వెర్షన్‌ అయిపోతున్నాయి. వీటిని అమ్మి కొత్తది తీసుకుందామంటే మనకు తెలిసిన మార్కెట్‌లో సరైన ధర రావడం కష్టంగా మారింది. ఇలాంటి వారికి చక్కని వేదికగా మారింది క్యాషిఫై. ఈ-కామర్స్‌కు కొత్త భాష్యం చెబుతూ రీ-కామర్స్‌గా పాత ఎలక్ట్రానిక్ వస్తువులని ప్రజల నుంచి కొనుగోలు చేస్తుందీ వెబ్‌ పోర్టల్‌. 

రీ-కామర్స్‌
ఇది ఈ-కామర్స్‌ కాదు.. రీ-కామర్స్‌. అంటే పాత వస్తువుల్ని కొనడమే వీళ్ల పని. ఎలక్ట్రానిక్స్‌ కేటగిరీలో ఫీచర్‌ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌వాచ్‌, స్మార్ట్‌ స్పీకర్‌, డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా, ఇయర్‌బడ్స్‌ తదితర వస్తువులన్నీ ఈ సైట్‌లో అమ్మే అవకాశం ఉంది. క్యాషిఫై వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడున్న ఆప్షన్లను అనుసరిస్తే మీ దగ్గరున్న ప్రొడక్టుకి ఎంత ధర వస్తుందో తెలియజేస్తుంది. ఆ తర్వాత మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాక..  ఫైనల్‌ ధర ఎంతో నిర్ధారిస్తుంది. అందుకు ప్రొడక్టు ఓనర్‌ అంగీకరిస్తేనే డీల్‌ ముందుకు వెళ్తుంది.

ఎక్సేంజీ కంటే మేలు
ప్రముఖ ఈ కామర్స్‌ సైట్లలో సైతం ఎక్సేంజ్‌ ఆఫర్లు రెగ్యులర్‌గా ఉంటాయి. అయితే ఎక్సేంజ్‌ ఆఫర్లలో కంపెనీలు పాత ఫోన్లకు చాలా తక్కువ ధరను ఆఫర్‌ చేస్తుంటాయి. పైగా అన్ని రకాల పాత మోడళ్లపై ఎక్సేంజీ ఆఫర్‌ వర్తించవు. అంతేకాదు మనకు నచ్చిన వస్తువలపై ఎక్సేంజీ ఆఫర్‌ ఉండకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా క్యాషిఫైలో పాత గాడ్జెట్స్‌ అమ్మేయోచ్చు. 

ఆఫ్‌లైన్‌లో కూడా
ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లోనే వ్యాపారం చేస్తూ వచ్చిన క్యాషిఫై తాజాగా ఆఫ్‌లైన్‌లోకి వచ్చింది. రిటైల్‌ చైయిన్‌ యూనిషాప్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఢిల్లీ, బెంగళూరు, ముంబై ఏరియాల్లో 60కి పైగా రిటైల్‌ షాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా టైర్‌ టూ సిటీలకు కూడా విస్తరించేలా క్యాషిఫై ప్రణాళిక సిద్దం చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఆఫ్‌లైన్‌ సౌకర్యం హైదరాబాద్‌ని పలకరించే అవకాశమూ ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top