ఈ–స్కూటర్‌ కస్టమర్లకు చార్జర్‌ డబ్బు వాపస్‌

Ola Electric, Ather to refund charger cost to e-scooter buyers - Sakshi

తిరిగివ్వనున్న ఓలా ఎలక్ట్రిక్, ఏథర్‌

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనాలతో పాటు చార్జర్లను విడిగా కొనుగోలు చేసిన కస్టమర్లకు సదరు చార్జర్ల డబ్బును వాపసు చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్, ఎథర్‌ ఎనర్జీ తెలిపాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. స్వార్ధ శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ విద్యుత్‌ వాహనాల పరిశ్రమ గత కొన్నాళ్లుగా అసాధారణంగా వృద్ధి చెందినట్లు సోషల్‌ మీడియా సైట్‌ ట్విటర్‌లో ఓలా పేర్కొంది.

ఈ నేపథ్యంలో కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన కస్టమర్లందరికీ చార్జర్ల డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అయితే, ఎంత మొత్తం చెల్లించనున్నదీ మాత్రం వెల్లడించలేదు. ఇది సుమారు రూ. 130 కోట్లు ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఇక, ఈవీ స్కూటర్లతో కలిపే చార్జర్లను విక్రయించే అంశంపై భారీ పరిశ్రమల శాఖతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు ఎథర్‌ ఎనర్జీ తెలిపింది.

చట్టబద్ధంగా ఇలా చేయాల్సిన అవసరం లేనప్పటికీ వాహనాలతో పాటే చార్జరును కూడా ఇచ్చేలా తమ నిబంధనలు మార్చుకున్నట్లు వివరించింది. అలాగే 2023 ఏప్రిల్‌ 12కు ముందు కొనుగోలు చేసిన వాహనాల విషయంలో చార్జర్లకు వసూలు చేసిన మొత్తాన్ని రిఫండ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇదే తరహాలో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తాము రూ. 20 కోట్లు పైచిలుకు వాపసు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top