ప్రైవేటు రుణాల్లో 12% వరకూ రాబడి!

Non-bank lenders, credit funds to invest USD 89 billions in five years - Sakshi

వచ్చే ఐదేళ్లలో భారీగా ప్రైవేటు రుణ వృద్ధి

89 బిలియన్‌ డాలర్లు ఉండవచ్చని అంచనా

ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ నివేదిక

న్యూఢిల్లీ: ప్రైవేటు రుణాల విషయంలో రాబడులు 12 శాతం వరకూ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విభాగంపై నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), క్రెడిట్‌ ఫండ్స్‌ దృష్టి సారించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) విశ్లేషించింది. ఈ నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో ఈ విభాగంలోకి 89 బిలియన్‌ డాలర్ల(రూ.6,67,500 కోట్లు) వరకూ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు వెలువడిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు...

► వచ్చే ఐదేళ్లలో ఒత్తిడిలో ఉన్న ఆస్తులపై పెట్టుబడి అవకాశాలు, ఎన్‌పీఏల కొనుగోళ్లు, తాజా క్రెడిట్‌ డిఫాల్ట్‌లు అన్నీ పరిశీలిస్తే ప్రైవేటు రుణ అవకాశాల విలువ దాదాపు 25 బిలియన్‌ డాలర్లు.  

► ప్రైవేట్‌ క్రెడిట్‌ పెట్టుబడిదారులకు భారత్‌  చక్కటి వ్యవస్థాగత అవకాశాన్ని అందిస్తుంది. మొండి బకాయిల సమస్య నేపథ్యంలో ఇబ్బందికరమైన పెట్టుబడులకు రుణ దాతలు దూరంగా ఉన్నారు.

► ఎన్‌బీఎఫ్‌సీలు 2018లో వాటిని చుట్టుముట్టిన లిక్విడిటీ సంక్షోభం నుండి ప్రస్తుతం కోలుకుంటున్నాయి.  

► ప్రైవేట్‌ క్రెడిట్‌ వార్షికంగా సంవత్సరానికి 12–18 శాతం మధ్య అంతర్గత రాబడిని అందజేస్తుందని అంచనా. వచ్చే ఐదేళ్లలో ప్రైవేటు రుణ పెట్టుబడి 39–89 బిలియన్‌ డాలర్ల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది.  

► ఒత్తిడితో కూడిన రుణ విభాగంపై సైతం ప్రైవేటు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రాబడులు 18–24 శాతం వరకు ఉంటాయని భావించడమే దీనికి కారణం.  

► స్థిర కరెన్సీ, అధిక ఆర్థిక వృద్ధి వంటి అంశాలు పెట్టుబడిదారు విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలికంగా పెట్టుబడులపై 12 శాతం నుంచి 24 శాతం వరకూ రాబడి లభిస్తుందని అంచనా.  

► వడ్డీరేట్లు మున్ముందు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రైవేటు రుణ ఇన్వెస్టర్లలో ఉంది. ఇంకా తగ్గించలేని కనిష్ట స్థాయిలో వడ్డీరేట్లు, కమోడిటీ ధరలు పుంజుకోవడం, ద్రవ్యోల్బణం ఆందోళనలు, రుణదాత హక్కుల అమల్లో జాప్యం నివారణకు ఇటీవలి చర్యలు వంటి అంశాలు దీనికి కారణం.  

► అయితే ప్రైవేట్‌ క్రెడిట్‌ మార్కెట్‌ కొన్ని సవాళ్లనూ ఎదుర్కొంటోంది. అధికారిక దివాలా ప్రక్రియలో జాప్యం, నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఫ్రేమ్‌వర్క్‌ వెలుపల తీర్మానాలలో జాప్యం, కార్పొరేట్‌ పాలన సమస్యలు, సర్ఫేసీ చట్టం వాస్తవ అమల్లో అడ్డంకులు వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావించదగినవి.

► ప్రైవేట్‌ క్రెడిట్‌ గొడుగు కింద జరిగే అనేక ఒప్పందాలు చోటుచేసుకుంటున్నాయి. దివాలా చట్టాల కింద ఒత్తిడికి గురైన వ్యాపారాన్ని కొనుగోలు చేయడం, వన్‌–టైమ్‌ సెటిల్‌మెంట్, అవకాశాలకు అనుగుణంగా లేదా ప్రత్యేక పరిస్థితుల లావాదేవీల వంటివి ఇందులో ఉన్నాయి.  

► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌ వంటి ఆఫ్‌షోర్‌ మార్గంలో లేదా ఏఐఎఫ్, ఎన్‌బీఎఫ్‌సీ, అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఏర్పాటు ద్వారా ఆన్‌షోర్‌ పెట్టుబడులు ద్వారా ప్రైవేటు రుణ మార్కెట్‌ మరింత విస్తరించే వీలుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top