
సానుకూల రేటింగ్‌కు ముప్పు లేదు
ఎస్‌అండ్‌పీ అంచనా
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లు భారత వృద్ధిని అడ్డుకోలేవని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. భారత్ ఎగుమతులపై ఆధారపడిన దేశం కాదని గుర్తు చేసింది. భారత సార్వభౌమ రేటింగ్ అంచనా సానుకూలంగానే కొనసాగుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ యీఫార్న్ ఫువా స్పష్టం చేశారు. భారత సార్వభౌమ రేటింగ్‌ను బీబీబీ మైనస్ నుంచి సానుకూలానికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ఎస్‌అండ్‌పీ గతేడాది మేలో ప్రకటించడం తెలిసిందే.
బలమైన వృద్ధి అవకాశాలను ఇందుకు నేపథ్యంగా పేర్కొంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్‌అండ్‌పీ అంచనాగా ఉంది. భారత్‌పై ఈ నెల 6 నుంచి 25 శాతం టారిఫ్‌లను యూఎస్ అమలు చేస్తుండడం, ఆగస్ట్ 27 నుంచి మరో 25 శాతం మేర టారిఫ్‌లు అమలు కానున్న నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ గ్లోబల్ తన విశ్లేషణను వెల్లడించింది.
టారిఫ్‌ల విధింపు భారత సానుకూల ఔట్‌లుక్‌ను తగ్గించొచ్చా? అన్న సందేహంపై యీఫార్న్ స్పందించారు. అమెరికాతో వాణిజ్యం భారత జీడీపీలో 2 శాతంగానే ఉన్నట్టు గుర్తు చేశారు. ప్రధాన రంగాలైన ఫార్మాస్యూటికల్స్, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఎగుమతులకు టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉన్నట్టు చెప్పారు. దీర్ఘకాలంలో అధిక టారిఫ్‌లు భారత ఆర్థిక వ్యవస్థపై ఏమంత ప్రభావం చూపించబోవంటూ.. సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు.
పెట్టుబడులపైనా ప్రభావం ఉండదు..
అమెరికా టారిఫ్‌లు భారత్‌లో పెట్టుబడులపై ప్రభావం చూపిస్తాయా? అన్న ప్రశ్నకు ఈఫార్న్ స్పందిస్తూ.. గత కొన్నేళ్లలో చైనా ప్లస్ వన్ విధానం ఫలితమిచ్చినట్టు చెప్పారు. భారత్‌లో వ్యాపారాన్ని ప్రారంభించిన కంపెనీలు దేశీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకునే ఆ పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌కు వచ్చే చాలా వరకు పెట్టుబడులు యూఎస్‌కు ఎగుమతుల కోసం ఉద్దేశించినవి కావు. దేశీయంగా భారీ డిమాండ్ ఉండడమే కారణం. మధ్యతరగతి వర్గం పెద్ద ఎత్తున విస్తరిస్తోంది.
భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే కంపెనీలు, ఎగుమతులు చేయాలనుకునే వాటికి యూఎస్ మార్కెట్ ప్రధానంగా ఉండకపోవచ్చు’’ అని ఈఫార్న్ వివరించారు. 2021–25 మధ్య భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండడం గమానార్హం. దేశ మొత్తం ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకే వెళ్లాయి. భారత్ దిగుమతుల్లో అమెరికా వాటా 6.22 శాతంగా ఉంది. 2024–25లో ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా భారత్ 35.32 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కలిగి ఉంది.