టెస్లాకు క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే? | Sakshi
Sakshi News home page

Tesla: టెస్లాకు క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే?

Published Thu, Oct 26 2023 4:24 PM

Nitin Gadkari's Clear Message To Elon Musk's Tesla - Sakshi

అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' (Tesla) గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ప్రవేశించడానికి సరైన సమయం కోసం వేచి చూస్తోంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇటీవలే కొన్ని ఆంక్షలతో సుముఖత చూపించింది. తాజాగా కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు ఓ స్పష్టమైన సందేశం అందించారు.

భారతదేశం టెస్లాకు స్వాగతం పలుకుతుంది, కానీ కంపెనీ స్థానికంగా కార్లను తయారు చేస్తే ఇతర సంస్థలకు లభించే అన్ని రాయితీలు లభిస్తాయి. చైనాలో తయారు చేసి భారతదేశంలో విక్రయించాలనుకుంటే రాయితీలు లభించవని గడ్కరీ స్పష్టం చేశారు.

గతంలో సీబీయూ మార్గం ద్వారా దిగుమతైన కార్లపై ప్రభుత్వం దిగుమతి సుంకాను తగ్గించింది. ప్రస్తుతం స్థానిక ఉత్పత్తులను పెంచడానికి, విదేశీ దిగుమతులను తగ్గించడానికి కేంద్రం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభించడానికి కట్టుబడి ఉన్న సంస్థలకు కొన్ని ప్రత్యేక రాయితీలను కల్పిస్తోంది.

ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్‌.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్‌మెంట్‌ కొనేసింది!

కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారభించాలనుకుంటే మొదటి రెండు సంవత్సరాల్లో దాదాపు 20 శాతం భాగాలను స్థానికంగా సోర్సింగ్ చేయాలి, ఆ తరువాత ఇది 40 శాతానికి పెరిగే అవకాశం ఉంది. సంస్థలకు బ్యాంకు గ్యారెంటీలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న విధంగా అన్నీ జరిగితే టెస్లా, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి కంపెనీలకు గణనీయమైన ప్రయోజనాన్ని పొందుతాయి.

ఇదీ చదవండి: కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్' - ఫోటోలు చూశారా?    

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం భారతదేశంలో వాహన తయారీని పెంచడమే. ప్రస్తుతం టెస్లా కంపెనీ భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి తమ ప్రణాళికలకు సంబంధించి, ప్రభుత్వంతో సానుకూల చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే సంస్థ భారతదేశంలో సంవత్సరానికి 5,00,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఒక కర్మాగారాన్ని స్థాపించాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు. టెస్లా ఫ్యాక్టరీ, ఉత్పత్తికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడవుతాయని భావిస్తున్నాము.

Advertisement
 
Advertisement