
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున వ్యయాలు చేస్తున్నప్పటికీ, అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రజలపై పన్నుల భారం మోపలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పన్నులు పెంచకపోవడమే మధ్యతరగతి వర్గాలకు ఊరటగా భావించాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో ఆదాయ పన్ను భారం తగ్గేలా ప్రతిపాదనలు ఉంటాయని మధ్య తరగతి వర్గాలు ఆశించినప్పటికీ దానికి భిన్నంగా ట్యాక్స్ శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. దీని మీద వచ్చిన ప్రశ్నలపై మంత్రి ఈ విధంగా స్పందించారు.
‘పన్నులు పెంచుతారేమోనని అంచనాలు పెట్టుకుని ఉంటే, నేను ఆ పని చేయలేదు. గతేడాది, ఈ ఏడాది కూడా నేను పన్ను రేట్లు పెంచలేదు. అదనంగా పన్ను భారం మోపి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. పన్నులను పెంచడం ద్వారా మహమ్మరి సవాళ్లను ఎదుర్కొనవచ్చని అనుకోలేదు‘ అని చెప్పారు. ఇన్‌ఫ్రా, గ్రామీణం, వ్యవసాయం, హౌసింగ్ మొదలైన వాటిపై ప్రభుత్వం చేసే వ్యయాలను గురించి వివరిస్తూ .. వీటి వల్ల అంతిమంగా మధ్య తరగతి వర్గాలకు అదనపు ఆదాయం లభించగలదని తెలిపారు. ‘కొన్ని సందర్భాల్లో ఇవ్వగలం. మరికొన్ని సందర్భాల్లో వేచి చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ మిడిల్ క్లాస్ కోసం చాలానే చేశాం‘ అని మంత్రి చెప్పారు. ఎంఎస్‌ఎంఈలు, అందుబాటు ధరల్లో గృహాలు, సీనియర్ సిటిజన్లు, రిటైల్ ఇన్వెస్టర్లు మొదలైన వర్గాల కోసం అమలు చేస్తున్న చర్యలను ప్రస్తావిస్తూ.. మధ్యతరగతి వర్గానికి చెందిన వారందరికీ ఉపశమనం చేకూర్చామని వివరించారు.