దేశంలో దూసుకెళ్తోన్న డిజిటల్‌ ఎకానమీ

Nirmala Sitaramanan Says Digital Economy Going To Touch 800 Bn Dollars - Sakshi

800 బిలియన్‌ డాలర్లకు డిజిటల్‌ ఎకానమీ

  2030 నాటికి అంచనా 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి   

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ వినియోగం, ఆదాయాలు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత డిజిటల్‌ ఎకానమీ గణనీయంగా వృద్ధి చెందనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2030 నాటికి 800 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు.

ప్రస్తుతం దేశీయంగా 6,300 పైచిలుకు ఫిన్‌టెక్‌ సంస్థలు ఉండగా .. వీటిలో 28 శాతం సంస్థలు ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్నాలజీ, 27 శాతం పేమెంట్స్, 20 శాతం ఇతరత్రా రంగాలకు చెందినవి ఉన్నాయని మంత్రి సీతారామన్‌ చెప్పారు. ‘భారత్‌లో డిజిటల్‌ ఎకానమీ 2020లో 85–90 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇంటర్నెట్‌ వినియోగం, ఆదాయాల వృద్ధితో ఇది అనేక రెట్లు పెరిగి 2030 నాటికి 800 బిలియన్‌ డాలర్లకు చేరనుంది‘ అని ఆమె వివరించారు.

రిటైల్‌ ఇన్వెస్టర్లు.. స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేసిందని మంత్రి చెప్పారు. దీంతో 2016 మార్చిలో 4.5 కోట్లుగా ఉన్న రిటైల్‌ ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 2021 మార్చి 31 నాటికి ఏకంగా 8.82 కోట్లకు చేరాయని ఆమె వివరించారు. డిజిటల్‌ ఎకానమీకి తోడ్పాటు అందించే దిశగా కేంద్రం తాజా బడ్జెట్‌లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల (డీబీయూ) ఏర్పాటును ప్రతిపాదించినట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు.    

చదవండి: డిజిటైజేషన్‌తో బ్యాంకింగ్‌లో పెను మార్పులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top