ఎన్‌హెచ్‌ఏఐ మరో రూ.3,800 కోట్లు సమీకరణ | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఏఐ మరో రూ.3,800 కోట్లు సమీకరణ

Published Fri, Oct 14 2022 6:34 AM

NHAI InvIT looks to raise additional Rs 3,800 cr - Sakshi

న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఎన్‌హెచ్‌ఏఐ ఇన్విట్‌) ద్వారా మరో రూ.3,800 కోట్ల నిధులను సమీకరించాలని అనుకుంటున్నట్టు కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఎన్‌హెచ్‌ఏఐ ఇన్విట్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 25 ఏళ్ల కాలానికి ఎన్‌సీడీల జారీ ద్వారా మరో రూ.1,500 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదన కూడా ఉన్నట్టు చెప్పారు.

ఇన్విట్‌ బాండ్లను ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో లిస్ట్‌ చేస్తామన్నారు. దీంతో ఇన్వెస్టర్లు వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చని, ట్రేడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఇన్విట్‌లు ఇప్పటి వరకు రూ.8,000 కోట్లను విదేశీ, దేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు జారీ చేయడం ద్వారా సమీకరించినట్టు మంత్రి వెల్లడించారు. ఇన్విట్‌లు ఆదాయాన్నిచ్చే మౌలిక ప్రాజెక్టులపై నిధులు సమీకరించుకునేందుకు కంపెనీలకు ఒక మార్గం. తద్వారా ఆయా నిధులను అవి ఇతర ప్రాజెక్టులకు వినియోగించుకోగలవు. 

Advertisement
Advertisement