వ్యాక్సిన్లవైపు మార్కెట్ల చూపు

Next week market trend may depends on Vaccine news - Sakshi

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, చమురు ధరల ఎఫెక్ట్‌

రిటైల్‌ ధరలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలకూ ప్రాధాన్యం

వచ్చే వారం మార్కెట్ల ట్రెండ్‌పై విశ్లేషకుల అంచనాలు

నిఫ్టీకి 13,520 వద్ద రెసిస్టెన్స్‌- 13,100- 12,800 వద్ద సపోర్ట్స్‌‌!

ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత బలపడే వీలున్నట్లు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌) నుంచీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్నట్లు తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనా వేయడంతో సెంటిమెంటు బలపడినట్లు పేర్కొన్నారు. దీనికితోడు దేశీయంగా రూపొందుతున్న వ్యాక్సిన్లు మూడో దశ పరీక్షలకు చేరడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి వచ్చే వారం మార్కెట్లు కన్సాలిడేషన్‌ మధ్య సానుకూలంగా కదిలే అవకాశమున్న్లట్లు అంచనా వేశారు.

గణాంకాలు
రానున్న శుక్రవారం(11న) నవంబర్‌ నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు విడుదలకానున్నాయి. ఇదే రోజు అక్టోబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు సైతం వెల్లడికానున్నాయి. కోవిడ్‌-19 సవాళ్ల నుంచి జీడీపీ పురోగతి బాట పట్టినట్లు ఆర్‌బీఐ తాజాగా అభిప్రాయపడటంతో ఈ గణాంకాలకు ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌, భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్‌ పరీక్షలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా క్యాడిలా వ్యాక్సిన్‌కు సైతం మూడో దశ పరీక్షలకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. యూకే బాటలో దేశీయంగా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తే మార్కెట్లు మరింత దూకుడు చూపవచ్చని తెలియజేశారు. 
 
సాంకేతికంగా..
గత వారం సెన్సెక్స్‌ 930 పాయింట్లు ఎగసి 45,080 వద్ద నిలిచింది. తద్వారా మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 45,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 290 పాయింట్లు జంప్‌చేసి 13,259 వద్ద ముగిసింది. ఇది కొత్త గరిష్టంకాగా.. సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం నిఫ్టీ కీలక అవరోధమైన 13,250 పాయింట్లను అధిగమించి నిలిచింది. దీంతో నిఫ్టీకి 13,520 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఒకవేళ మార్కెట్లు బలహీనపడితే.. తొలుత 13,100 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించే వీలుంది. ఈ స్థాయిని కోల్పోతే.. 12,800 పాయింట్ల వద్ద మరోసారి మద్దతు దొరకవచ్చు. 

ఇతర అంశాలూ..
డాలరుతో రూపాయి మారకం, ప్రపంచ మార్కెట్ల సంకేతాలు, 9 నెలల గరిష్టాలకు చేరిన చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు వంటి అంశాలు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్ నిపుణులు పేర్కొంటున్నారు. సెకండ్ వేవ్ లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు నెలకొన్నట్లు తెలియజేశారు. అయితే కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్‌ సహాయక ప్యాకేజీకి మద్దతివ్వడంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక దేశీయంగా ఇటీవల కాలంలో ఎఫ్ఐఐలు ఈక్విటీలలో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తున్నారు. గత నెలలో నికరంగా రూ. 65,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇదే సమయంలో దేశీ ఫండ్స్ రూ. 48,319 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top