
ఆర్థిక గణాంకాలు, క్యూ4 ఫలితాలు కీలకం
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకూ ప్రాధాన్యం
ఈ వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌పై విశ్లేషకుల అంచనాలు
ముంబై: భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపు యుద్ధమేఘాలు అలుముకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడ్డాయి. అయితే వారాంతాన కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ సరిహద్దు పొడవునా పాక్ అతిక్రమణలకు పాల్పడినట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి అనిశి్చత పరిస్థితులు తలెత్తినట్లు పేర్కొన్నారు. వెరసి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేవరకూ మార్కెట్లు బలహీనపడవచ్చని అభిప్రాయపడ్డారు.
ద్రవ్యోల్బణంపై కన్ను
ఏప్రిల్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(13న) విడుదలకానున్నాయి. మార్చిలో సీపీఐ వరుసగా ఐదో నెలలోనూ నీరసిస్తూ 3.34 శాతానికి పరిమితమైంది. ఈ బాటలో ఏప్రిల్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు 14న వెల్లడికానున్నాయి. మార్చిలో డబ్ల్యూపీఐ 2.38 శాతం నుంచి 2.05 శాతానికి బలహీనపడింది. ఇక ప్రభుత్వం ఏప్రిల్ నెల వాణిజ్య గణాంకాలను గురువారం(15న) ప్రకటించనుంది. మార్చిలో దేశీ వాణిజ్యలోటు 21.54 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆర్థిక గణాంకాలు కొంతమేర మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
ఫలితాలు కీలకం
ఇప్పటికే గతేడాది(2024–25) చివరి త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వచి్చంది. ఈ బాటలో ఈ వారం సైతం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జనవరి–మార్చి(క్యూ4) పనితీరును వెల్లడించనున్నాయి. జాబితాలో రేమండ్, టాటా స్టీల్, యూపీఎల్(12న), టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, సిప్లా, హీరోమోటో కార్ప్, సీమెన్స్, గెయిల్(13న), ఐషర్ మోటార్స్, లుపిన్, శ్రీ సిమెంట్, టాటా పవర్(14న), అబాట్ ఇండియా, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా, గోద్రెజ్ ఇండస్ట్రీస్(15న), బీహెచ్‌ఈఎల్(16న) ఫలితాలు ప్రకటించనున్నాయి. భారత్, పాక్ ఉద్రిక్తతలతోపాటు క్యూ4 ఫలితాలు ట్రెండ్‌కు కీలకంగా నిలవనున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా అభిప్రాయపడ్డారు.
విదేశీ అంశాలు
ఈ వారం ఏప్రిల్ నెలకు యూఎస్ గణాంకాలు వెలువడనున్నాయి. ద్రవ్యోల్బణం 13న, రిటైల్ అమ్మకాలు 15న విడుదలకానున్నాయి. గురువారం ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. వరుసగా మూడో సమావేశం(మే)లోనూ ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంవద్ద కొనసాగించేందుకే కట్టుబడిన సంగతి తెలిసిందే. శుక్రవారం(16న) జపాన్ జీడీపీ(జనవరి–మార్చి) ప్రాథమిక వృద్ధి రేటు గణాంకాలు వెలువడనున్నాయి.
గత వారమిలా..
భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం(5–9) దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ నికరంగా 1,048 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 79,454 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 339 పాయింట్లు(1.4 శాతం) నీరసించి 24,008 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు సైతం 1.4 శాతం చొప్పున నష్టపోయాయి.
అమ్మకాలు పెరిగితే
మార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడటంతో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 24,000 పాయింట్లవద్ద నిలిచింది. భారత్, పాక్ మధ్య ఘర్షణలు నెలకొనడంతో నిఫ్టీ 23,900స్థాయి దిగువకు చేరే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది జరిగితే మార్కెట్లు మరింత బలహీనపడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాకాకుండా 24,250 పాయింట్ల ఎగువకు చేరితే బలాన్ని పుంజుకునే వీలున్నట్లు అంచనా వేశారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణతోపాటు పరిస్థితులు కుదుటపడితే సెంటిమెంటుకు ప్రోత్సాహం లభించవచ్చని మెహతా ఈక్విటీస్ సీనియర్ వీపీ(రీసెర్చ్) ప్రశాంత్ తాప్సీ విశ్లేషించారు. సాధారణంగా మార్కెట్లు ఇలాంటి పరిస్థితుల నుంచి త్వరగా రికవరీ సాధిస్తాయని అభిప్రాయపడ్డారు.
ఎఫ్‌పీఐలు రివర్స్‌గేర్
గత రెండు వారాలుగా దేశీ స్టాక్స్‌లో నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత వారాంతాన ఉన్నట్టుండి నికర అమ్మకందారులుగా నిలిచారు. నగదు విభాగంలో శుక్రవారం(9న) రూ. 3,799 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 14,167 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! జీఎస్‌టీ వసూళ్లు, ఎఫ్‌పీఐ పెట్టుబడులు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. జనవరిలో రూ. 78,027 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, మార్చిలో 3,973 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌లో రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. తిరిగి ఈ నెలలో దేశీ స్టాక్స్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.