టాక్స్‌ పేయర్లకు అలర్ట్‌..! ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌..!

New income tax rule changes from 1 April 2022 - Sakshi

మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం(2022-23) రాబోతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను నిబంధనలలో అనేక మార్పులు రానున్నాయి. ఆదాయపు పన్నులపై కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2022న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పలు మార్పులు సూచించింది. డిజిటల్‌, క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను, అప్‌డేట్ చేయబడిన రిటర్న్‌ల దాఖలు, ఈపీఎఫ్‌ వడ్డీపై కొత్త పన్ను నియమాలు, కోవిడ్-19 చికిత్సపై పన్ను ఉపశమనం వంటి వాటిపై  ఏప్రిల్1 , 2022 నుంచి కొన్ని మార్పులు రానున్నాయి. 

2022  ఏప్రిల్‌ 1 నుంచి రానున్న ప్రధాన ఏడు మార్పులు ఇవే..!

1) క్రిప్టో పన్ను
ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో క్రిప్టోకరెన్సీలపై పన్ను విధానం క్రమంగా అమలులోకి రానుంది. క్రిప్టో ఆస్తులపై సుమారు 30 శాతం పన్ను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. అయితే 1 శాతం టీడీఎస్‌ మాత్రం జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను విధింపుకు సంబంధించి 2022-23 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 

2) లాభాలు, నష్టాలతో సంబంధం లేదు..!
క్రిప్టోకరెన్సీ, డిజిటల్‌ ఆస్తుల విషయలో కేంద్రం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. క్రిప్టో హోల్డింగ్ మరొక వెర్షన్ నుంచి వచ్చే ఆదాయానికి వ్యతిరేకంగా నిర్దిష్ట డిజిటల్ ఆస్తిలో వచ్చే నష్టాలను అనుమతించకుండా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. క్రిప్టో ఆస్తులను మైనింగ్ చేస్తున్నప్పుడు ఏర్పడే అవస్థాపన ఖర్చులపై ప్రభుత్వం పన్ను మినహాయింపులను అనుమతించదు. ఎందుకంటే వాటిని సముపార్జన ఖర్చుగా పరిగణించబడదు. సింపుల్‌గా చెప్పలాంటే ఒక వ్యక్తి  బిట్‌కాయిన్‌పై రూ. 1000 లాభం, మరోక క్రిప్టోకరెన్సీ ఈథిరియం రూ. 700 నష్టాన్ని పొందినట్లయితే, సదరు వ్యక్తి రూ.1000పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ సదరు వ్యక్తి పొందిన నికర లాభం రూ. 300 పన్ను ఉండదు. అదేవిధంగా, స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి ఇతర ఆస్తులలో లాభ, నష్టాలకు వ్యతిరేకంగా క్రిప్టోకరెన్సీపై లాభ, నష్టాలను సెట్ చేయలేరు.

3) ఐటీ రిటర్న్ ఫైలింగ్‌
ఆదాయపు పన్ను రిటర్న్‌లలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు గాను కొత్త నిబంధన అమలులోకి రానుంది. పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాలలోపు అప్‌డేటేడ్‌ రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు.

4) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ మినహాయింపు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు సెక్షన్ 80CCD(2) కింద తమ బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 14 శాతం వరకు ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్ కోసం ఎంప్లాయర్ ద్వారా డిడక్షన్‌ను క్లెయిమ్ చేసుకోగలరు.  గతంలో ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండేది. 

5) పీఎఫ్‌ ఖాతాపై పన్ను
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను (25వ సవరణ) రూల్-2021 ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ రూ. 2.5 లక్షలు దాటితే పన్ను విధించబడుతోంది.  దీనికి మించి కంట్రిబ్యూషన్ చేస్తే, వడ్డీ ఆదాయంపై పన్ను విధించబడుతుంది.

6) కోవిడ్-19 చికిత్స ఖర్చులపై పన్ను మినహాయింపు
జూన్ 2021 కేంద్ర ప్రకటన ప్రకారం...కోవిడ్ వైద్య చికిత్స కోసం డబ్బు పొందిన వ్యక్తులకు పన్ను మినహాయింపు అందించబడింది. అదేవిధంగా, కోవిడ్ కారణంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు కుటుంబ సభ్యులు స్వీకరించే రూ. 10 లక్షల డబ్బుపై టాక్స్‌ మినహాయింపు ఉంటుంది. సదరు వ్యక్తి మరణించిన తేదీ నుంచి 12 నెలలలోపు డబ్బు అందినట్లయితే ఎలాంటి టాక్స్‌ ఉండదు. 

7) వైకల్యం ఉన్న వ్యక్తులకు పన్ను మినహాయింపు
వికలాంగుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వైకల్యం కల్గిన వ్యక్తికి బీమా పథకాన్ని తీసుకోవచ్చు. దీనిపై పన్ను మినహాయింపు ఉంటుంది. 

చదవండి: ఈపీఎఫ్ చందాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top