జోరుగా.. హుషారుగా..నియామకాలు!

Nearly 54% Indian Companies Plan To Hire In December  - Sakshi

న్యూఢిల్లీ: రానున్న మూడు నెలల్లో (అక్టోబర్‌–డిసెంబర్‌) ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రానున్నాయి. 54 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవాలని అనుకుంటున్నాయి. మ్యాన్‌ పవర్‌ గ్రూప్‌ నిర్వహించిన ‘ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే’ ఈ వివరాలను నివేదికగా విడుదల చేసింది. కార్మిక మార్కెట్‌ సెంటిమెంట్‌ రానున్న త్రైమాసికానికి బలంగా ఉన్నట్టు తెలిపింది.

మ్యాన్‌పవర్‌ గ్రూపు భారత్‌ సహా 41 దేశాల్లో ఉపాధి మార్కెట్‌ తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు ఈ సర్వే నిర్వహించింది. భారత్‌లో సర్వే ఫలితాలను గమనించినట్టయితే.. 64 శాతం కంపెనీలు ఉద్యోగులను పెంచుకోవాలని అనుకుంటున్నాయి. 24 శాతం కంపెనీలు ఎలాంటి మార్పు ఉండదని చెప్పాయి. 10 శాతం కంపెనీల్లో నియామకాల ధోరణి తగ్గింది. దీని ప్రకారం సగటున 54 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఈ సర్వే తేల్చింది. బ్రెజిల్‌లో 56 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలలకు ఉద్యోగుల నియామకాల విషయంలో ఆశావహంగా ఉంటే, ఆ తర్వాత భారత్‌ అత్యధిక రేటుతో రెండో స్థానంలో ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే.. మన దేశంలో నియామకాల సెంటిమెంట్‌లో 10 శాతం వృద్ధి కనిపిస్తోంది. త్రైమాసికం వారీగా చూస్తే నియామకాల సెంటిమెంట్‌ 3% మెరుగుపడింది. 

భారత్‌కు ప్రయోజనం..   
‘‘భారత్‌ ఆర్థిక మూలాలు పటిష్టంగా, బలంగా ఉన్నాయి. స్వల్పకాల ప్రతికూలతలు ఉన్నా కానీ, వృద్ధికి మద్దతునిచ్చే విధానాలు, మౌలిక రంగంలో పెట్టుబడులు, ఎగుమతులు పెరగడం వల్ల మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ప్రతికూలతలను అధిగమిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల వర్ధమాన దేశాలు, మరీ ముఖ్యంగా భారత్‌ వృద్ధికి మద్దతునిస్తుంది. ఎగుమతులు పెంచుకుంటుంది.

అదే సమయంలో అంతర్జాతీయ మందగమనంపై వదంతులు నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో అప్రమత్త ధోరణి నెలకొంది’’అని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా ఎండీ సందీప్‌ గులాటీ తెలిపారు. నియామకాల పట్ల సానుకూల ధోరణి బలంగానే ఉన్నా కానీ, తమకు కావాల్సిన నైపుణ్య మానవ వనరులు లభించడం లేదని 85 శాతం కంపెనీలు చెప్పడం ఆందోళనకరం. ఇక భారత్‌లో ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణాది, ఉత్తరాదిన వచ్చే మూడు నెలల్లో ఉద్యోగులను నియమించుకోవాలని 56 శాతం కంపెనీలు అనుకుంటుంటే.. పశ్చిమాదిన 53 శాతం, తూర్పున 47 శాతంగానే ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top