ఫేస్‌బుక్‌, యాపిల్‌ పుష్‌- 11,000కు నాస్‌డాక్‌ 

Nasdaq crosses 11,000 points mark- tech shares push - Sakshi

ఆటుపోట్ల మధ్య గురువారం యూఎస్‌ మార్కెట్లు అప్‌

తగ్గిన నిరుద్యోగ క్లెయిములతో బలపడిన సెంటిమెంటు

ఫేస్‌బుక్‌ 6.5 శాతం, యాపిల్ ఇంక్‌ 3.5 శాతం ప్లస్‌

ప్రధానంగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌, ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌, టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ జోరు చూపడంతో గరువారం నాస్‌డాక్‌ చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ఎక్స్ఛేంజీల చరిత్రలో తొలిసారి  11,000 పాయింట్ల మార్క్‌ ఎగువన ముగిసింది. డోజోన్స్‌ 185 పాయింట్లు(0.7 శాతం) లాభపడి 27,387కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 21 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 3,349 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 110 పాయింట్లు(1 శాతం) ఎగసి 11,108 వద్ద స్థిరపడింది. తద్వారా ఆల్‌టైమ్‌ హై వద్ద నిలిచింది. కాగా.. ఫిబ్రవరిలో నమోదైన రికార్డ్‌ గరిష్టాలను చేరేందుకు ఎస్‌అండ్‌పీ 1 శాతం, డోజోన్స్‌ 7 శాతం చొప్పున లాభపడవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు.

అంచనాలకంటే తక్కువ
ఆగస్ట్‌ 1తో ముగిసిన వారంలో నిరుద్యోగ క్లెయిములు 1.2 మిలియన్లుగా నమోదైనట్లు యూఎస్‌ లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ తాజాగా పేర్కొంది. కోవిడ్‌-19 సంక్షోభం తలెత్తాక ఈ గణాంకాలు కనిష్టంకాగా.. విశ్లేషకులు 1.4 మిలియన్‌ దరఖాస్తులను అంచనా వేశారు. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా తొలుత ఏర్పడిన నష్టాల నుంచి మార్కెట్లు బయటపడి లాభాలతో ముగిసినట్లు తెలియజేశారు.

టెక్‌ అండ
గురువారం ఫేస్‌బుక్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరగడంతో 6.5 శాతం జంప్‌చేసింది. 265 డాలర్లకు ఎగువన నిలిచింది. ఈ బాటలో యాపిల్‌ ఇంక్‌ 3.5 శాతం ఎగసి 456 డాలర్ల సమీపంలో స్థిరపడింది. ఇక గూగుల్‌ 2 శాతం పుంజుకుని 1500 డాలర్లను తాకగా.. మైక్రోసాఫ్ట్‌ 1.6 శాతం లాభంతో 216 డాలర్లకు చేరింది. ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్‌ సైతం 1.4 శాతం బలపడి 509 డాలర్ల వద్ద ముగిసింది. అమెజాన్‌ 0.6 శాతం వృద్ధితో 3225 డాలర్ల వద్ద నిలిచింది. 

ఆసియా డీలా
గురువారం యూరోపియన్‌ మార్కెట్లు 0.6-1.5 శాతం మధ్య డీలా పడ్డాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. హాంకాంగ్‌, చైనా, ఇండొనేసియా, సింగపూర్‌, జపాన్‌, తైవాన్‌, థాయ్‌లాండ్‌ 2.25-0.6 శాతం మధ్య క్షీణించాయి. కొరియా 0.15 శాతం నష్టంతో కదులుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top