Mukesh Ambani Resigns Reliance Jio As Director, Akash Ambani Named Chairman, Details Inside - Sakshi
Sakshi News home page

Mukesh Ambani Resignation: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో కీలక పరిణామం

Published Wed, Jun 29 2022 7:17 AM

Mukesh Ambani Resigns Reliance Jio As Director Akash Ambani Named Chairman - Sakshi

దేశంలోనే అత్యంత విలువైన కార్పొరేట్‌ గ్రూప్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపర కుబేరుడు, రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ తన వారసులకు ఆస్తుల పంపకం ప్రక్రియకు తెరతీశారు. టెలికం అనుబంధ విభాగమైన రిలయన్స్‌ జియోకు ముకేశ్‌ అంబానీ రాజీనామా చేశారు. తద్వారా టెలికం విభాగం పగ్గాలను తనయుడు ఆకాశ్‌ అంబానీకి అప్పగించారు.  

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) గ్రూప్‌ యాజమాన్యంలో భారీ మార్పులకు ముకేశ్‌ అంబానీ బాటలు వేశారు. పెద్ద కొడుకు ఆకాశ్‌ ఎం.అంబానీకి టెలికం విభాగం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇందుకు అనుగుణంగా టెలికం బోర్డు నుంచి వైదొలిగారు. సోమవారం సమావేశమైన కంపెనీబోర్డు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆకాశ్‌ ఎం. అంబానీని చైర్మన్‌గా నియమించే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు రిలయన్స్‌ జియో స్టాక్‌ ఎక్స్ఛేంజ్జీలకు తాజాగా సమాచారమిచ్చింది. సోమవారం సాయంత్రం ముకేశ్‌ అంబానీ రాజీనామా చేసినట్లు బోర్డు వెల్లడించింది. 217 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఆర్‌ఐఎల్‌ గ్రూప్‌.. చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్, మీడియా, న్యూఎనర్జీ విభాగాలలో విస్తరించిన విషయం విదితమే. 

వారసులకు బాధ్యతలు... 
ముకేశ్‌ అంబానీ ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఈషా కవలలుకాగా.. చిన్న కుమారుడు అనంత్‌. రిటైల్‌ బిజినెస్‌ పగ్గాలను కుమార్తె ఈషా (30 ఏళ్లు) చేతికి ఇవ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. పిరమల్‌ గ్రూప్‌నకు చెందిన ఆనంద్‌ పిరమల్‌ను ఈషా వివాహం చేసుకున్న విషయం విదితమే. అజయ్‌ పిరమల్, స్వాతి పిరమల్‌ కుమారుడు ఆనంద్‌ కాగా.. ఇప్పటికే ఆకాశ్, ఈషా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఆర్‌వీఎల్‌) బోర్డులో విధులు నిర్వహిస్తున్నారు.

సూపర్‌ మార్కెట్లు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫ్యాషన్, జ్యవెలరీ, ఫుట్‌వేర్, క్లాతింగ్‌ విభాగాలతోపాటు ఆన్‌లైన్‌ రిటైల్‌ వెంచర్‌ జియోమార్ట్‌ను రిలయన్స్‌ రిటైల్‌ కలిగి ఉంది. ఇక డిజిటల్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ (జేపీఎల్‌) బోర్డులోనూ 2014 అక్టోబర్‌ నుంచీ వీరిద్దరూ కొనసాగుతున్నారు. ఇక 26 ఏళ్ల అనంత్‌ ఇటీవలే ఆర్‌ఆర్‌వీఎల్‌ బోర్డులో డైరెక్టరుగా చేరారు. 2020 మే నుంచి జేపీఎల్‌లోనూ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 

ఎండీగా పంకజ్‌... 
ఈ నెల 27 నుంచి ఐదేళ్లపాటు ఎండీగా పంకజ్‌ మోహన్‌ పవార్‌ను బోర్డు ఎంపిక చేసినట్లు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మాజీ కార్యదర్శి రమీందర్‌ సింగ్‌ గుజ్రాల్, మాజీ సీవీసీ కేవీ చౌదరిలను స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించినట్లు పేర్కొంది. వీరిరువురూ ఇప్పటికే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ బోర్డులో కొనసాగుతున్నారు. కంపెనీ ప్రధానంగా మూడు బిజినెస్‌ విభాగాలను కలిగి ఉంది. ఇవి చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికంసహా డిజిటల్‌ సర్వీసులు. రిటైల్, డిజిటల్‌ సర్వీసులను పూర్తి అనుబంధ ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసింది.

న్యూఏజ్‌పై దృష్టి...
ఆర్‌ఐఎల్‌కుగల 3 బిజినెస్‌లూ పరిమాణంలో  సమానమేకాగా.. గ్రూప్‌లోని ఆధునిక విభాగాలు రిటైల్, టెలికంలలో ఆకాశ్, ఈషా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అనంత్‌ పునరుత్పాదక ఇంధనం, చమురు, కెమికల్‌ యూనిట్లకు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయం ద్వారా 65 ఏళ్ల పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌.. ఆస్తుల పంపకం విషయంలో స్పష్టంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2002లో తండ్రి మరణం తదుపరి వ్యాపార సామ్రాజ్య విభజనలో తమ్ముడు అనిల్‌ అంబానీతో వివాదాలు నెలకొన్న కారణంగా ముకేశ్‌ ప్రస్తుత నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు వారు చెబుతున్నారు.  
ఈ వార్తలతో ఆర్‌ఐఎల్‌ షేరు 1.5 శాతం బలపడి రూ. 2,530 వద్ద ముగిసింది.

ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌గా ముకేశ్‌... 
ఆర్‌ఐఎల్‌కు ముకేశ్‌ అంబానీ చైర్మన్, ఎండీగా, ఆయన సతీమణి నీతా అంబానీ బోర్డులో సభ్యురాలిగా కొనసాగనున్నారు. అంతేకాకుండా జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌కు చైర్మన్‌గానూ ముకేశ్‌ కొనసాగనున్నారు. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌సహా అన్ని జియో డిజిటల్‌ సర్వీసుల బ్రాండ్లు జియో ప్లాట్‌ఫామ్స్‌ కిందకు వస్తాయి. కంపెనీ వివరాల ప్రకారం అంబానీ కుటుంబ వాటా ఆర్‌ఐఎల్‌లో 50.6 శాతానికి చేరింది. 1973లో ధీరూభాయ్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి👉 ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా?

Advertisement
Advertisement