అంబానీ మీడియా సంస్థకు భారీ నష్టాలు | Mukesh Ambani Network18 Reports Q4 Net Loss of Rs 29 61 Crore | Sakshi
Sakshi News home page

అంబానీ మీడియా సంస్థకు భారీ నష్టాలు

Apr 19 2026 11:34 AM | Updated on Apr 19 2026 11:50 AM

Mukesh Ambani Network18 Reports Q4 Net Loss of Rs 29 61 Crore

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ నెట్‌వర్క్‌18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ 2025–26 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.29.61 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.29.09 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదిన కార్యకలాపాల ద్వారా ఆదాయం 9.7% పెరిగి రూ.561.32 కోట్ల నుంచి రూ.615.78 కోట్లు చేరింది.

టీవీ న్యూస్‌ రంగంలో ప్రకటనల డిమాండ్‌ 10 శాతం తగ్గినా, కంపెనీ ప్రకటన ఇన్వెంటరీ 4.5 శాతం పెరగడం ద్వారా పరిశ్రమ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఎబిటా రూ.30 కోట్లుగా ఉండగా, ఎబిటా మార్జిన్‌ 4.9 శాతంగా నమోదైంది. మొత్తం వ్యయాలు 6.47 శాతం పెరిగి రూ.670.89 కోట్లకు చేరాయి. 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.155.20 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మొత్తం సమీకృత ఆదాయం రూ.2,148.46 కోట్లుగా నమోదైంది.

‘‘ఇండియాకాస్ట్‌ మీడియా డిస్ట్రిబ్యూషన్‌ నవంబర్‌ 14, 2024 నుంచి, స్టూడియో 18 మీడియా డిసెంబర్‌ 30, 2024 నుంచి అనుబంధ సంస్థల జాబితా నుంచి తప్పుకోవడంతో, 2024–25 ఆర్థిక సంవత్సర గణాంకాలను 2025–26 గణాంకాలతో నేరుగా పోల్చడం సాధ్యం కాదు’’ అని కంపెనీ తెలిపింది.

అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లోనూ కంపెనీ మంచి ఫలితాలతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించిందని కంపెనీ చైర్మన్‌ అదిల్‌ జైనుల్‌భాయ్‌ తెలిపారు. సంచలనాల కంటే నిజమైన వార్తలపై దృష్టి పెట్టామన్నారు. కొత్త వ్యాపారాలతో ఆదాయం విభిన్నంగా మారుతోందని, న్యూస్‌ వ్యాపారాన్ని బలోపేతం చేస్తూనే, విస్తరణ కొనసాగిస్తామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement