
చదువు పూర్తి చేసుకుని కెరియర్‌లోకి అడుగుపెడుతున్న చాలా మంది యువతకు పర్సనల్ ఫైనాన్స్‌పై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అప్పుడే చదువు అయిపోయి ఉంటుంది..కొత్త ఉద్యోగం.. కొత్త కొలీగ్స్.. పార్టీలు.. బ్రాండెడ్ వస్తువులు.. డైనింగ్‌లు.. ఇలా చాలా వాటికి విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. కానీ కెరియర్ ఇనిషియల్ స్టేజ్ నుంచే పొదుపు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. దాంతో దీర్ఘకాలంలో భారీ కార్పస్‌ను క్రియేట్ చేయవచ్చని చెబుతున్నారు. అందుకు ఏం చేయాలో సలహాలు ఇస్తున్నారు.
త్వరగా పొదుపు ప్రారంభించాలి..
మొదటి జీతం పెద్దగా లేకపోయినా, ప్రతి నెలా ఎంతో కొంత పొదుపు చేయడం ప్రారంభించాలి. చక్రవడ్డీ నిజంగా దీర్ఘకాలంలో అద్భుతాలు చేస్తుందని నమ్మండి. ఈ రోజు పొదుపు చేసిన డబ్బు కాలక్రమేణా గణనీయంగా పెరుగుతుంది. ఉదా..22 సంవత్సరాల వయసు నుంచి నెలకు రూ.1,000 పొదుపు చేస్తే రిటైర్మెంట్ నాటికి ఏటా 12 శాతం రిటర్న్‌తో లెక్కిస్తే కనీసం రూ.50 లక్షలు సమకూరుతాయి.
ఖర్చులను ట్రాక్ చేయాలి..
సంపాదించడం ప్రారంభించినప్పటి నుంచే డబ్బు ప్రవాహాన్ని ట్రాక్ చేయాలి. అందుకు అవసరమయ్యే ఎక్సెల్ షీట్స్ వంటి బడ్జెట్ టూల్స్‌ను ఉపయోగించవచ్చు. దీనికి అధికంగా ఖర్చు చేస్తున్నారో షీట్‌లో చూసుకొని, ఖర్చు తగ్గించుకుంటే ఫలితం ఉంటుంది.
అనవసరమైన ఈఎంఐలు..
ఈఎంఐ ద్వారా లేటెస్ట్ కాస్ట్‌లీ ఫోన్ లేదా బైక్ కొనడం సులభంగా అనిపించవచ్చు. కానీ నెలవారీ ఈఎంఐ మీ ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అత్యవసరం లేదా పెట్టుబడి సాధనం(విద్య లేదా గృహనిర్మాణం వంటివి) రుణాలను తీసుకోవద్దు.
అత్యవసర నిధి
జీవితం అనూహ్యమైంది. మారుతున్న టెక్నాలజీ వల్ల ఏవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో చెప్పలేం. ఉద్యోగం కోల్పోవడం లేదా వైద్య సమస్యలు ఎప్పుడైనా ఎదురవ్వొచ్చు. కనీసం 3 నుంచి 6 నెలలకు సరిపడా ఖర్చులను ప్రత్యేక, సులభంగా నగదుగా మార్చగలిగే సాధనాల్లో పొదుపు చేయాలి.
టర్మ్ ఇన్సూరెన్స్
చదువు అయిపోయి ఉద్యోగంలో చేరిన వెంటనే ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇది తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని అందిస్తుంది. ఎండోమెంట్స్ లేదా యులిప్స్ వంటి జీవిత బీమా పథకాలకు దూరంగా ఉండండి. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం తక్కువ పడుతుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్
మంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతినెలా క్రమానుగత పెట్టుబడులు(సిప్) పెట్టాలి. ఇది దీర్ఘకాలిక సంపదను పెంపొందించడానికి సహాయపడుతుంది. ప్రత్యేకంగా మార్కెట్‌కు సమయం కేటాయించాల్సిన అవసరం లేదు.
ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ఓ 3.0 కీలక ఫీచర్లు.. 8 కోట్ల మందికి ప్రయోజనం