మేకపాటి గౌతమ్‌రెడ్డి.. ఆఖరి క్షణాల వరకు ఏపీ అభివృద్ధి కోసమే

Mekapati Goutham Reddy Last Programme As a Minister For IT and Industries - Sakshi

నేటి రాజకీయాల్లో మృదు స్వభావిగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవడం చాలా అరుదు. అలాంటి గుర్తింపు సాధించిన అరుదైన రాజకీయవేత్తల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒకరు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా తన ఆఖరి క్షణాల వరకు ఏపీ అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పన అంశాలపైనే ఆయన ఫోకస్‌ చేశారు. రాష్ట్రం విడిచి పది రోజుల పాటు విదేశాల్లోనే మకాం వేసి భారీ ఎత్తున పెట్టుబడులు ఏపీకి తీసుకువచ్చారు. ఎంతో సంతోషకరమైన వార్తను ఏపీ ప్రజలతో స్వయంగా పంచుకోకుండానే ఆయన హఠన్మరణం పొందారు. 

చనిపోవడానికి ఒక్క రోజు ముందు వరకు మేకపాటి గౌతంరెడ్డి ఏపీ అభివృద్ధి కోసమే శ్రమించారు. ఏపీ ఐటీ పరిశ్రమల మంత్రి హోదాలో చివరగా దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. 2022 ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ దుబాయ్‌ ఎక్స్‌పోలో నిర్వహించిన ఏపీ పెవిలియన్‌ను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో వారం రోజుల పాటు అలుపెరగకుండా చర్చలు జరిపారు. అంతేకాదు అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ రోడ్‌షోలో ఆయన స్వయంగా పాల్గొని ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. 

మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి శ్రమ ఫలించి ఏపీలో భారీ పెట్టుబడులకు అనేక కంపెనీలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు ఆదివారం ఆయన జారీ చేసిన ప్రకటనలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సుస్థిరమైన పాలనలో నవరత్నాలు పేరుతో అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ఏపీకి భారీ పెట్టుబడులు రాబోతున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 11 సెక్టార్లలో 70 ప్రాజెక్టులకు గ్రీన్‌ పెట్టుబడి అవకాశాలను దుబాయ్‌ ఎక్స్‌పోలో సాధించినట్టు ఆయన వివరించారు. రూ. 5,150 కోట్ల పెట్టుబడులకు ఆరు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. 

దుబాయ్‌ ఎక్స్‌పోలో కుదిరిన ఒప్పందాల్లో రీజెన్సీ గ్రూపు హైపర్‌ రిటైల్, ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగాల్లో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. అల్యూమినియం కాయిల్స్, ప్యానల్స్‌ తయారీకి మల్క్‌ హోల్డింగ్స్‌ సంస్థ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అదే విధంగా ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు షరాఫ్‌ గ్రూపు, శీతలీకరణ మౌలిక వసతులు కల్పించే తబ్రీద్, ఎలక్ట్రికల్‌ బస్సుల తయారీకి కాసిస్‌ ఈ-మొబిలిటీ, స్మార్ట్‌ సిటీ యుటిలీటీకి సంబంధించి ఫ్లూయంట్‌ గ్రిడ్‌ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 3,440 మందికి, పరోక్షంగా 7,800 మందికి ఉపాధి లభించనుంది.

దుబాయ్‌ ఎక్స్‌పో ముగించుకున్న అనంతరం మరో మూడు రోజులు ఆయన దుబాయ్‌లోనే ఉన్నారు. 2022 ఫిబ్రవరి 20 రాత్రి హైదరాబాద్‌కి ఆయన చేరుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో సాధించిన విజయాలను, రాబోతున్న పెట్టుబడులు, యువతకు లభించనున్న ఉపాధి అవకాశాలను ఏపీ ప్రజలకు స్వయంగా తెలియజేయాలనుకున్నారు. కానీ దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి 24 గంటలు కూడా పూర్తికాక ముందే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. చివరి క్షణం వరకు ఆయన ఏపీ అభివృద్ధి, యువత ఉపాధిలనే తన ‍‍శ్వాసగా ఆయన జీవించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం: హైదరాబాద్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top