అప్పులు చేసి పారిపోయిన మెహుల్‌ చోక్సీ.. హైదరాబాద్‌ ఆస్తుల అమ్మకం | Sakshi
Sakshi News home page

అమ్మకానికి మెహుల్‌ చోక్సీ ఆస్తులు.. సొంతం చేసుకున్న హైదరాబాద్‌ సంస్థ

Published Wed, Jan 12 2022 1:32 PM

Mehul Choksi Assets Own By Hyderabad Firm Through Insolvency process - Sakshi

బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీకి చెందిన ఆస్తులను హైదరాబాద్‌కి చెందిన ఓ సంస్థ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికారిక వ్యవహరాలు ఇటీవలే కొలిక్కి వచ్చాయి. 

హైదరాబాద్‌లో పెట్టుబడులు
ఒకప్పుడు దేశంలో ప్రముఖ వజ్రాల ‍ వ్యాపారిగా మెహుల్‌ చోక్సీ వెలుగొందారు. రోజుకో దేశంలో తిరుగుతూ కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ఈ క్రమంలో బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణం పొందారు. వీటితో దేశవ్యాప్తంగా తన వ్యాపారాలను విస్తరించారు.  ఈ క్రమంలో హైదరాబాద్‌కి చెందిన ఏపీ జెమ్స్‌, జ్యూయల్లరీ వ్యాపారాన్ని మెహుల్‌ చోక్సీ సొంతం చేసుకున్నారు.

విదేశాలకు పరారీ
బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లించలేదు. ఈ విషయంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఒత్తిడి చేయడంతో అప్పు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు మెహుల్‌ చోక్సీ. ఈ క్రమంలో ఆయన దివాళా తీసినట్టుగా ప్రకటించారు. దీంతో ఇండియాలో ఆయన ఆస్తులను బ్యాంకుల అప్పులు తీర్చే ప్రక్రియ కొనసాగుతుంది.

అమ్మకానికి ఆమోదం
ఏపీ జెమ్స్‌ అండ్‌ జ్యూయల్లరీ కంపెనీ 2001లో హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ఆ తర్వాత క్రమంలో కంపెనీని మెహుల్‌ చోక్సీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కార్పోరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్‌  ప్రాసెస్‌ (సీఐఆర్‌పీ) 2019లో మొదలైంది. ఈ క్రమంలో  ఏపీ జెమ్స్‌ని అమ్మకానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. 

విలువ ఎంతంటే
హైదరాబాద్‌కి చెందిన రియాల్టీ డెవలపర్స్‌ సంస్థ రూ. 107 కోట్ల రూపాయలకు ఏపీ జెమ్స్‌ అండ్‌ జ్యూయల్లర్స్‌ని కొనేందుకు ముందుకు వచ్చింది. అమ్మకం ద్వారా సమకూరిన మొత్తాన్ని అప్పుల కింద బ్యాంకులకు జమ చేస్తారు. కాగా ఏపీ జెమ్స్‌ అండ్‌ జ్యూయలర్స్‌ సంస్థకి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో రెండెకరాల స్థలంతో పాటు ఐదు అతంస్థుల భవనం ఉంది. 2018 నుంచి ఈ ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి.  

చదవండి: విజయ్‌ మాల్యా కోర్టు ధిక్కరణ కేసు.. ఆ రోజే తుది తీర్పు

Advertisement
Advertisement